Seethakka: పెద్దపెద్ద మాటలు చెప్పి స్కాలర్ షిప్ లను రద్దు చేశారు.. కేంద్రంపై సీతక్క ఫైర్
విదేశీ విద్య పథకంపై సీతక్క స్పందించారు.
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: విదేశీ విద్యా పథకం కింద 1913 మంది విద్యార్థులు చదువుతున్నారని ఈ పథకానికి గత బకాయిలతో కలిసి రూ. 167 కోట్లు చెల్లించామని మంత్రి సీతక్క (seethakka) చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 210 మంది ఎస్సీలు, 100 మంది ఎస్టీలు, 300 మంది బీసీ, 500 మంది మైనార్టీ విద్యార్థులు ఎంపిక అయ్యారని వెల్లడించారు. విదేశీ విద్యా పథకం కింద మొత్తం 1,110 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన సీతక్క.. విదేశీ విద్యా పథకాన్ని (Overseas Education Scheme) రాజకీయం చేయాలనేది బీఆర్ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ (Gangula Kamalakar) తపన అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ బకాయిలు రూ. 4332 కోట్లు ఉన్నాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో డైట్ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్ చార్జీలు 212 శాతం పెంచామన్నారు. విద్యార్థుల దేశ మానవ వనరులు అని అందుకే మా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. కలుషిత ఆహారంపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్టల్స్ బస చేస్తున్నారని చెప్పారు. మంచి విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నామని ఇందుకోసం నాలుగు నెలల కాలంలోనే రూ.499 కోట్లకుపైగా ఖర్చు చేశామన్నారు.
కేంద్రం రాష్ట్రానికి సహకరించాలి:
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, నూతన విద్యా విధానమని పెద్దపెద్ద మాటలు చెబుతున్న కేంద్రం విద్యార్థులకు అందే స్కాలర్షిప్ ల విధానాన్ని రద్దు చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. విద్యారంగం మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి బొట్టుపనే తప్ప బోనం లేదన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలి. పేద మధ్యతరగతి కుటుంబీకులే ప్రభుత్వము మీద ఆధారపడతారు కాబట్టి కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్నారు.