BIG Scam: బీఆర్ఎస్‌కు శరాఘాతం.. తెరపైకి రూ.160 కోట్ల స్కామ్
గురుకులాల భవనాలకు అద్దె పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేతలు, వారి బంధువులకు పెద్ద ఎత్తున దోచిపెట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గురుకులాల భవనాలకు అద్దె పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేతలు, వారి బంధువులకు పెద్ద ఎత్తున దోచిపెట్టింది. గురుకుల భవనాలకు ఆర్‌అండ్‌బీ శాఖ సూచించిన మేర అద్దె రేట్లను కాదని.. గ్రామీణ, మారుమూల గిరిజన ప్రాంతాల్లోని భవనాలకు సైతం భారీగా అద్దెలు వసూలు చేసి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తెలిసింది. ఈ డబ్బులన్నీ పార్టీ నాయకులు, వారి అనుచర గణం, బంధువుల జేబుల్లోకి వెళ్లాయి. గురుకులాల భవనాలకు అడ్డగోలుగా అద్దెలు నిర్ణయించి ప్రభుత్వం నుంచి వసూలు చేశారు. ఏకంగా 109 భవనాలకు గత ఆరేడు ఏండ్లుగా చెల్లింపులు చేస్తున్నట్టు తాజాగా అధికారులు గుర్తించారు.
ఏకంగా రూ.160 కోట్లు..
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.160 కోట్ల స్కామ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం బట్టబయలు చేసింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్‌తో సమానంగా దాదాపు అంతే మొత్తాన్ని గ్రామీణ, మారుమూల ప్రాంతాల భవనాలకు అద్దెలుగా చెల్లిస్తున్నట్టు గుర్తించారు. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన వ్యవహరం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. గురుకుల అద్దె భవనాలు అత్యధికంగా బీఆర్ఎస్ నేతలు, వారి బంధువులు, పార్టీ నేతలు, అప్పట్లో గురుకులాల సెక్రెటరీగా చేసిన ప్రస్తుత నేత, స్థాపించిన ప్రైవేటు సంస్థ, నాయకుల ఇళ్లు కూడా ఇందులో ఉన్నాయని తేలింది. వీరందరిపై విచారణ చేస్తే ప్రజాధనం వెలుగులోకి వస్తుందని అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. పార్టీ నేతగా, సానుభూతి పరుడుగా, బంధువులకు అప్పనంగా ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టారు.ఎలాంటి సౌకర్యాలు లేకున్నా.. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లోనూ లక్షల్లో అద్దె భవనాలు చెల్లిస్తున్నట్లు తేలింది. విద్యార్థుల పేరు చెప్పి గులాబీ నాయకులు తమ జేబులు నింపుకున్నట్లు గుర్తించారు.
గురుకులాల భవనాలకు తాళం.. ప్రభుత్వం సీరియస్
కొంతకాలం కిందట గురుకులాల అద్దెలు చెల్లించలేదని భవనాలకు తాళం వేస్తామంటూ యజమానులు బెదిరింపులకు దిగారు. సోషల్‌మీడియాలో హడావుడి చేశారు. ఒకే రోజు అత్యధికంగా భవనాల ఓనర్స్ తాళం వేయడంతో సీరియస్ అయిన ప్రభుత్వం విచారణకు సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. భవనాల యాజమానులు అంతా ఒకే పార్టీ నాయకులని, కీలక నేతల బంధువులు అని, ప్రైవేటు సంస్థ నేతలుగా గుర్తించారు. వారి ఆందోళన వెనుక ఇన్నాళ్లూ ఆ సంస్థలను నడిపిన ఓ లీడర్ గులాబీ పార్టీకి చెందిన వ్యక్తేనని గుర్తించారు. ఈ క్రమంలోనే భవనాల ఓనర్స్, వాటి అద్దెల విషయమై ఆరా తీసినట్టు టాక్. ఆర్‌అండ్‌బీ ఎంత అద్దె నిర్ణయించింది? కలెక్టర్ అధిక ధర ఎందుకు పెట్టారు? ఆయనపై ఎవరు ఒత్తిడి చేశారు? ఆ నేతల వివరాలను కూపీలాగగా.. స్కాం బయట పడింది. మొత్తం 109 గురుకులాలకు అత్యధికంగా అద్దెను చెల్లించినట్టు తేలగా.. దాని విలువ మొత్తంగా రూ.160 కోట్లు మేర ఉందని తెలిసింది.
శాశ్వత భవనాలకు నిధులు లేక..
శాశ్వత భవనాలకు గత సర్కార్ నిధులు కేటాయించకపోవడంతో అద్దె భవనాల్లోనే గురుకులాలు కొనసాగుతున్నాయి. అదే అదనుగా చేసుకుని బీఆర్ఎస్ నాయకులు రంగ ప్రవేశం చేశారు. తమకున్న అధికార బలాన్ని ఉపయోగించి నేతలు, బంధువుల ఆధ్వర్యంలో నడుస్తున్న భవనాల అద్దెలకు రెక్కలు వచ్చాయి. ఇష్టారీతిన ధరలను నిర్ణయించి గురుకులాలకు అద్దెకు ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా ప్రభుత్వం భవనాలకు ఎంతవరకు చదరపు అడుగుకు రేటు నిర్ణయించిందో దానికి సంబంధించి జీవోలు ఉన్నాయి. కానీ, జీవోలో ఉన్న ధరలకు వాస్తవ అగ్రిమెంట్ ధరలకు పొంతనే లేదు. ఆర్‌అండ్‌బీ శాఖ చదరపు అడుగుకు రూ.3 చొప్పున చెల్లించాలని సూచించింది. కానీ, గురుకులాల కోసం ఏకంగా రూ.18 వరకు చదరపు అడుగుకు ప్రభుత్వం చెల్లించింది. అయితే, జిల్లాల కలెక్టర్లపై అప్పటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి భారీ మొత్తంలో అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. గురుకులాలకు భవనాలు దొరకడం లేదనే సాకును చూపించి అద్దెలను భారీగా పెంచారు. సహజంగా పట్టణాల్లో ఎక్కువ ధరలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరలు ఉండాలి. కానీ, అక్కడ కూడా అధిక ధరలు చెల్లించారు. అందుబాటులో ఇతర భవనాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతల భవనాలనే ఎంపిక చేసి అగ్రిమెంట్చేసుకునేలా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ప్రభుత్వ సొమ్ము బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్లింది.
జిల్లాల వారీగా చెల్లించిన అద్దెల రేట్లు..BIG Scam: బీఆర్ఎస్‌కు శరాఘాతం.. తెరపైకి రూ.160 కోట్ల స్కామ్
భూపాలపల్లిలో చదరపు అడుగుకు రూ.14 చెల్లించగా, వికారాబాద్‌లోనూ రూ.14, ఆదిలాబాద్ రూ.13.50, కొత్తగూడెంలో రూ.15, హైదరాబాద్ మహేంద్ర హిల్స్‌లో రూ.16.50 చెల్లించగా.. ఎల్బీనగర్‌లో రూ.18, వరంగల్, హన్మకొండ నగరాల్లో ఒక్కొ చదరపు అడుగకు రూ.12 నుంచి 16 వరకు చెల్లించారు. ములుగులో రూ.18, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో రూ.10లు, ఖమ్మంలోనూ ఇదే రేటు ఉంది. బోధన్‌లో రూ.13.50, సరూర్ నగర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.18.50 ఉంది. దుబ్బాకలో రూ.11లు, బంట్వారంలో రూ.14, వాస్తవంగా ఆర్‌అండ్‌బీ అధికారులు హైదరాబాద్, చుట్టూ ప్రాంతాల్లో రూ.10లకు, ఇతర ప్రాంతాల్లో రూ.3 నుంచి రూ.5లకు ఫిక్స్ చేశారు.