నేను సమీకృతానికి వ్యతిరేకం కాదు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆర్ఎస్పీ స్పందన ఇదే

మా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు ఏమైందో అర్ధం కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎస్పీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-10-12 09:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు ఏమైందో అర్ధం కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎస్పీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమీకృత గురుకులాలకు ఎందుకు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. గురుకులాలు మొదటి నుంచి సమీకృతమే అది రేవంత్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరమని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆనాడు ఆనాడు 1971లో గురుకులాల విద్యావ్యవస్థకు బీజం వేశారని, దానిని కేసీఆర్ 3 రెట్లు పెంచారని స్పష్టంచేశారు. నాటి, నేటి గురుకులాలు సమీకృతమేనని, తాను సమీకృతానికి వ్యతిరేకం కాదన్నారు. అయితే సమీకృతంగా ఉన్న వ్యవస్థను కొత్త సీసాలో పాత సారా పోసీ అన్న చందంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ప్రక్రియకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు.

640 మంది విద్యార్థులకు ఒక దగ్గర సరిగ్గా ఉండలేకపోతున్నారని, వారికి కనీస భోజనం దొరకడం లేదన్నారు. 2560 మంది విద్యార్థులను ఒకే దగ్గరికి తీసుకు వస్తే చాలా సమస్యలు వస్తాయన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ దానికి మంచి ఉదాహరణ అని చెప్పారు. ఇప్పటికే ఉన్న మండలానికి ఒక గురుకులం సమీకృతమేనని, ఆ వ్యవస్థను కొనసాగించాలన్నారు. వాటికి వసతులు కల్పించి నిధులు పెంచాలన్నారు. అన్ని కులాలు కలిసి ఉన్నాయని, గురుకులాల్లో ఒక్కటే కులం ఉండదని, అన్ని కులాల విద్యార్థులు చదువుకుంటారని తెలిపారు. కావాలంటే గురుకులాల్లో రికార్డులు చెక్ చేయాలన్నారు. ఈ విషయం తెలియక ఒక్కటే కులం అని రేవంత్ రెడ్డి మాటిమాటికీ కేసీఆర్‌ను తిడుతున్నాడని ఫైర్ అయ్యారు.

కాగా, షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి శంకుస్థాపన లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అందిస్తుంటే.. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నేతల మాటలు పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఏ పార్టీలోనైనా ఉండొచ్చు.. అది మీ ఇష్టం. కానీ గురుకుల కార్యదర్శిగా పని చేసిన మీరు విద్య గురించి ఇలా మాట్లాడటం బాలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


Similar News