Minister Seethakka : బీఆర్ఎస్ నిర్వాకంతో రూ. 5197 కోట్లు ఫీజు బకాయిలు : మంత్రి సీతక్క
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని దీంతో రూ.5,197కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని మంత్రి సీతక్క(Minister Seethakka)మండిపడ్డారు.
దిశ, వెబ్ డెస్క్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని దీంతో రూ.5,197కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని మంత్రి సీతక్క(Minister Seethakka)మండిపడ్డారు. శాసన మండలిలో ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలపై సభ్యులు వాణి, ఏవిఎన్ రెడ్డిలు అడిగిన ప్రశ్నలపై మంత్రి సమాధానమిచ్చారు. 2019 నుంచి కాలేజీ యాజమాన్యాలకు ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 2019-20 లో 40 కోట్లు, 2020-21 లో 209 కోట్లు, 2021-22 లో 981 కోట్లు, 2022-23 లో 2120 కోట్లు, 2023-24 లో 1845 కోట్లు, మొత్తంగా బీఆర్ఎస్ గత ఐదేళ్ల పాలనలో రూ. 5197 కోట్లు ఫీ బకాయిలు గుట్టలుగా పేరుకపోయాయని మంత్రి సీతక్క వెల్లడించారు.
ఫీజు రీయంబర్స్ మెంట్ కాకపోవడంతో వనపర్తి జిల్లాలో లావణ్య అనే దళిత ఇంజనీరింగ్ విద్యార్దిని ఆత్మహత్య చేసుకుందని, బకాయిలతో విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారన్నారు. విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని, ఫీజు రీయంబర్స్ మెంట్, బీఆర్ఎస్ పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లిస్తామని తెలిపారు.