రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు

ఎకరానికి 15 వేలు ఇస్తామని 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమేనని, తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2025-01-05 17:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఎకరానికి 15 వేలు ఇస్తామని 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమేనని, తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే నని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువైందన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడిన ఈ కాంగ్రెస్ ను రైతన్నలు పాతరేస్తారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసా పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 వేలు ఇస్తామని చెప్పి 12 వేలే అంటూ సవాలక్ష కండీషన్లు పెట్టి... జనవరి 26న రైతు భరోసా మోసానికి అధికారికంగా తెరలేపున్నది రేవంత్ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. మోసం అనే పదం చిన్నదైపోతదని, దగా, నయవంచన పదాలు కూడా సరిపోవు.. డిక్షనరీలో పదాలు వెతకాలి అన్నారు.

కాంగ్రెస్ రైతాంగానికి చేసిన ఈ ద్రోహం.. తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతదని వెల్లడించారు. కపట నాటకాలకు, నోరు తెరిస్తే అబద్ధాలకు, బూటకపు వాగ్దానాలకు కేరాఫ్ కాంగ్రెస్, రేవంత్ అని రైతాంగానికి అర్థమైపోయిందన్నారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రైతు ద్రోహిగా మిగిలిపోతాడన్నారు. డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో అన్నారని, నా గ్యారెంటీ, కష్టమొస్తే వస్తా అని ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ.. నీకు తెలంగాణకు వచ్చే దమ్ము ఉందా? రైతులతో కలిసి కూర్చుంటావా? మోసం ఎందుకు చేస్తున్నారో చెప్పే దమ్ముందా? అని నిలదీశారు. రైతు భరోసా 12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోంది... ఎందుకు సంబరాలు చేయాలి రైతన్నలకు 15000 ఇస్తామని చెప్పి కోతలు పెట్టినందుకా? ఎన్నికల్లో ఓట్ల కోసం మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు పాలాభిషేకాలు చేయాలా? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ రైతు రుణమాఫీ, రైతు బంధుకు కలిసి లక్ష కోట్లు రైతుల ఖాతాలో వేశారని స్పష్టం చేశారు. కేసీఆర్ రైతుబందుగా నిలిచారు...రేవంత్ రెడ్డి రాబందుగా మిగులుతారన్నారు. అధికారంలో లేనప్పుడు మూడోపంటకు రైతుబంధు ఇవ్వాలని మాట్లాడి ఇప్పుడు ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతున్నారని.. రేవంత్ సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన పదివేలనే బిచ్చం అన్న రేవంత్.. మరి నువ్వు పెంచిన వెయ్యి రూపాయలు ఏంటి.. ముష్టి వేస్తున్నావా..? అని నిలదీశారు. రేవంత్ నుంచి రాహుల్ దాకా రైతులకు చెప్పిందేంటి.. చేసిందేంటి.. ఇచ్చిన మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా..? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలే అని డిమాండ్ చేశారు. రేవంత్ రైతాంగానికి తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలె..నమ్మించి నయవంచన చేసినందుకు రాహుల్ గాంధీ 70 లక్షల మంది రైతులకు క్షమాపణలు చెప్పాలె అని డిమాండ్ చేశారు.

మ్యానిఫెస్టోలో రైతులకిచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకోనందుకు ముఖ్యమంత్రి ముందుగా రాష్ట్ర రైతాంగం ముందు లెంపలేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతు భరోసాపై మాట మార్చినందుకు ముక్కు నేలకు రాయాలన్నారు. అదృష్టవంతుడివి రేవంత్.. రాష్ట్రాన్ని చిన్నగా చూపడం దుర్మార్గం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితులు బాగుండేదని రేవంత్ రెడ్డి అనడం అన్యాయమని, సీఎం పదవిలో కూర్చొని సీఎం తెలంగాణను కించపరిచారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు పీఆర్సీ,డీఏ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా? అని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దిగజారింది అని రేవంత్ మాట్లాడడం వారిని అవమానపరచడమేనన్నారు.

ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం కాదు... కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగలేదన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని నాశనం చేసింది రేవంత్ రెడ్డినే అని మండిపడ్డారు. మూర్ఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందని ఆరోపించారు. రాష్ట్రానికి ఆర్థిక ఇంజన్ గా ఉన్న హైదరాబాదులో హైడ్రా, మూసీ తో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. విధ్వంసకర పాలనతో కెయిన్, ఫాక్స్ కాన్ సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. సంవత్సరంలో లక్ష 38 వేల కోట్లు అప్పు చేసి ఎవరి జేబులు నింపుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పైసలు ఢిల్లీకి మూటలు పంపుతున్నారా.. దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం కాదు దివాళా తీసింది రేవంత్ రెడ్డి మెదడు అని మండిపడ్డారు. కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు పంచారన్నారు. 5,943 కోట్ల రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగించామని, రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు అబద్ధం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతీ నెలా 1734కోట్లు మిగులుతుందని ఏం చేస్తున్నారని నిలదీశారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వరో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ కేడర్ కు పిలుపు నిచ్చారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల,నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలుపుతామన్నారు. ఢిల్లీలో ఎంపీలు సైతం కొట్లాడుతారన్నారు. గన్ పార్క్ నుంచి గల్లీ వరకు, గ్రామాల నుంచి రాష్ట్ర రాజధాని వరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు కొట్లాడుతామన్నారు. ప్రభుత్వం మోసంపై ఊరు రా ప్లెక్సీలు పెడతామని స్పష్టం చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఎలా తిరుగుతారో చూద్దామన్నారు. ఉద్యోగులకు భూమితో సంబంధం లేకుండా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హార్టికల్చర్ రైతులకు రైతు భరోసా ఇస్తారా? ఇవ్వరా? అనే దానిపై క్లారిటీ లేదన్నారు. రైతు బంధు పథకం ఉండాలా వద్దా అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోండి అని పిలుపు నిచ్చారు. మోసానికి మారుపేరు.. ధోకాలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌ అని దుయ్యబట్టారు.


Similar News