కొడంగల్ లిఫ్ట్ టెండర్ల గోల్ మాల్ సంగతేంటి? : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హెటిరో స్కామ్ లో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, అలాగే సివిల్ సప్లయీస్ శాఖలో అక్రమాలపై ఆధారాలు బయటపెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Update: 2025-01-05 17:07 GMT

 దిశ, తెలంగాణ బ్యూరో : హెటిరో స్కామ్ లో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, అలాగే సివిల్ సప్లయీస్ శాఖలో అక్రమాలపై ఆధారాలు బయటపెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే.. తప్పు ఒప్పుకుంటున్నారా అని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శలు చేశారు. కేబినెట్ నిర్ణయాలు రైతులను నిరాశపరిచాయన్నారు. పెన్షన్ పెంపు, ఆరు గ్యారంటీలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఏబినెట్ నిర్ణయాలు ఉన్నాయని ఏలేటి ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ అవినీతి చర్యలపై దాటివేత ధోరణిని ప్రభుత్వం అవలంభిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ది డూప్ ఫైట్ అని చురకలంటించారు. తాను లేవనెత్తిన పలు అంశాలపై స్పందించకపోవడం ప్రభుత్వం తప్పు చేసిందనేందుకు నిదర్శనమని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లిఫ్ట్ టెండర్లు గోల్ మాల్ సంగతేంటని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రజా పోరాటాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఏలేటి హెచ్చరించారు.


Similar News