నేను వస్తా.. నువ్వు అక్కడికి రా.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

Update: 2023-10-15 12:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను కాపీ కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారని విమర్శించారు. కేసీఆర్‌లో పస తగ్గిందని, ఆయనకు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగానే.. కేసీఆర్ వారి అభ్యర్థులకు బీ-ఫామ్ లు పంచారన్నారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందు ఉందన్నారు.

తాము 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. కేసీఆర్ కేవలం 51 మందికే బీ ఫామ్‌లు ఇచ్చారని అన్నారు. గ్యారంటీలను కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద అగాథంలో పడిపోయారన్నారు. మేం ఆరు గ్యారంటీలు ఇస్తామంటే బీఆర్ఎస్ నేతలు అదెలా సాధ్యమని ప్రశ్నించారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌ను ప్రశ్నించే అర్హత కోల్పోయారన్నారు. కేసీఆర్‌లా తాము ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు సాధ్యమని కేసీఆర్ రాజముద్ర వేసి మరీ అంగీకరించారన్నారు.

అర్థంపర్థం లేని ఆరోపణలతో బిల్లా రంగాలు కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో డబ్బులు దొరికితే మాపై ఆరోపణలు చేస్తున్నారని స్పష్టంచేశారు. దోపిడీ సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని కేసీఆర్ వైఫల్యం చెందారని అన్నారు. అందుకే చలి జ్వరంతో ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలని, 17న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు నేను వస్తా.. కేసీఆర్ నువ్వు అక్కడికి రా.. ప్రమాణం చేద్దాం.. అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. 

Tags:    

Similar News