‘కాళేశ్వరం’ పై హరీశ్ రావుకు రిటైర్డ్ ఐఏఎస్ కౌంటర్! అందుకే బేకార్ ప్రాజెక్ట్ ఇట్లా ఏడ్చింది

కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 200 కిలో మీటర్ల టన్నెల్‌లు..

Update: 2024-02-17 10:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 200 కిలో మీటర్ల టన్నెల్‌లు, 1531 కిలోమీటర్ల కాలువలు, 240 టీఎంసీల నీటి వినియోగం అని ఇటీవల హరీశ్ రావు అన్నారు. ఇవేవి చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే దాన్ని బూతద్దంలో చూపిస్తున్నారని హరీశ్ రావు ఇటీవల అసెంబ్లీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావుకు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి శనివారం ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. బాబు హరీష్ గారు.. మేడిగడ్డ కుంగిపోయి, పనికి రాకుండా పోతే అది చిన్న విషయమా ? అని పేర్కొన్నారు.

‘మీరు గొప్పగా చెప్పిన కాళేశ్వరం కింద కట్టిన 9 రకాల నిర్మాణాలు కట్టడాలు అన్ని పని చేసేది మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి పోస్తేనే కదా మాజీ నీటి పారుదల శాఖ మంత్రి.. ఇప్పుడు మీరు చేసిన నిర్వాకంతో మూడు పిల్లర్లు నెర్రెలు బారిన మేడిగడ్డలో నీళ్లు నిలబడవు. మేడిగడ్డలో నీళ్లు ఉండకపోతే మిగతా రెండు బ్యారేజీలకు, 15 రిజర్వాయర్ లకు, 1531 కీ.మీల కాల్వలకు 240 టీఎంసీల నీళ్లు ఎట్లా వస్తాయి? పంపులు ఏం నీళ్లు ఎత్తి పోస్తాయి? కరెంట్ సబ్ స్టేషన్లు ఏం పని చేస్తాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మేడిగడ్డ బ్యారేజీ గుండె కాయలాంటిది. మీ తిక్కల అహంకారపూరిత పెద్ద దొర నువ్వు కలిసి పిచ్చి డిజైన్ చేసి కట్టిన బేకార్ ప్రాజెక్ట్ ఇట్లా ఏడ్చింది. చారానా కోడికి బారాణ మసాలా. రూపాయి పెట్టుబడి పెడితే 40 పైసలు ఆదాయం’ అని తీవ్ర విమర్శలు చేశారు.

ఇంకా ఎన్ని ఇలాంటి అబద్ధాలు ఆడుకుంటూ ప్రజలను మోసం చేస్తారు బాబు? అని నిలదీశారు. లక్ష కోట్ల రూపాయలు వేస్ట్ చేశామని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఇగ కింద కొంత మంది గులాబీ దొంగలు ఏదేదో బూతులు మాట్లాడుతారు తలా తోక లేకుండా. పట్టించుకోకండి’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News