ఏడాది కాదు 4 నెలల్లో హైడ్రాకు కొత్త ఆఫీస్.. ఏప్రిల్‌లోగా అంతా రెడీ

హైడ్రా ఆఫీసు అంటే అందుకు తగ్గట్టుగానే అదిరిపోయేలా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా పైగా ప్యాలెస్‌ను కేటాయించిన విషయం తెలిసిందే.

Update: 2024-10-25 02:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రాకు సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. హైడ్రా ఆఫీసు అంటే అందుకు తగ్గట్టుగానే అదిరిపోయేలా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా పైగా ప్యాలెస్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. రూ.8 కోట్లతో హెచ్ఎండీఏ పనులు ప్రారంభించింది. అయితే హెరిటేజ్ నిర్మాణంగా తీర్చిదిద్దడానికి ఏడాది సమయం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కానీ.. అప్పటి వరకు హైడ్రా ఆఫీసు తరలించే అంశాన్ని వాయిదా వేయడానికి కమిషనర్ రంగనాథ్ సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో ప్యాలెస్ వెనుక భాగంలో ఉన్న రెండు భవనాలను మరమ్మతులు చేస్తే 4 నెలల్లో పనులు పూర్తిచేయడానికి అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్‌లో హైడ్రా ఆఫీసును తరలించే యోచనలో అధికారులు ఉన్నారు.

రీజినల్ ఆఫీసులు..

గ్రేటర్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో మూడు హైడ్రా రీజినల్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన రీజినల్ కార్యాలయాన్ని బుద్ధభవన్‌లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాచకొండకు సంబంధించిన రీజినల్ కార్యాలయాన్ని తార్నాకలోని పాత హెచ్ఎండీఏ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్‌కు సంబంధించిన కార్యాలయాన్ని నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్జీసీఎల్) ఆఫీసులో ఏర్పాటు చేయనున్నారు. వీటికి సంబంధించిన ఆదేశాలు జారీచేశారు. ఆ కార్యాలయాలకు సంబంధించిన ఫర్నీచర్, పరికరాలు, ఇతర అంశాలను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలీసు స్టేషన్‌ను మాత్రం బుద్ధభవన్‌లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

చెరువుల అనుసంధానంతోనే వ‌ర‌ద‌ క‌ట్టడి..

- వాటర్‌ ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా.మ‌న్సీబాల్ భార్గవ‌

చెరువుల అనుసంధానం, గొలుసుకట్టు చెరువుల పరిరక్షణతోనే వరద ముప్పును కట్టడి చేయవచ్చునని వాటర్‌ ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా.మ‌న్సీబాల్ భార్గవ‌ అన్నారు. గురువారం హైడ్రా కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ఆధ్వర్యంలో మ‌న్సీబాల్ భార్గవ‌తో స‌మావేశమయ్యారు. న‌గ‌రంలో చెరువుల ప‌రిస్థితిపై స‌మీక్షించారు. వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు తీసుకుంటున్న చ‌ర్యల‌ను రంగనాథ్ వివరించారు. హైడ్రా చ‌ర్యల‌ ప‌ట్ల భార్గవ‌ హ‌ర్షం వ్యక్తం చేశారు. చెరువుల పున‌రుద్ధర‌ణ‌తోనే న‌గ‌రానికి వ‌ర‌ద‌ ముప్పు త‌ప్పుతుందని సూచించారు. చెరువుల‌లో ఆక్రమ‌ణ‌లు తొల‌గింపు న‌గ‌రం ముంపున‌కు గురికాకుండా చేసిన శ‌స్త్ర చికిత్స లాంటిదని డా.మ‌న్సీబాల్ భార్గవ వివరించారు.

Tags:    

Similar News