మంచి ఫలితాలిస్తున్న ఆ రెండు కార్యక్రమాలు.. దాదాపు 3,076 చిన్నారులకు విముక్తి

బాల కార్మికుల సంక్షేమానికి పోలీసు, కార్మిక, ఇతర శాఖలు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి.

Update: 2025-01-05 02:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బాల కార్మికుల సంక్షేమానికి పోలీసు, కార్మిక, ఇతర శాఖలు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రతి ఏడాది వేలాది మంది చిన్నారులను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పిస్తున్న అధికారులు.. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ‘ఆపరేషన్ స్మైల్’కు అధికారులు సిద్ధమయ్యారు. జనవరి 1 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, 31వ తేదీ వరకు కొనసాగించనున్నారు. తనిఖీల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందులో పోలీసులు, కార్మిక శాఖ, బాలల సంరక్షణ శాఖ, రెవెన్యూ, చైల్డ్‌ హెల్ప్‌ లైన్ సహా పలు స్వచ్ఛంద సంస్థలు పాలుపంచుకుంటున్నాయి.

ఆర్థిక సమస్యలతో బాల కార్మికులుగా..

పుస్తకాలు పట్టుకొని పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్నారులు.. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో బాల కార్మికులుగా మారుతున్నారు. హోటళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ఇటక బట్టీల వద్ద వెట్టి చాకిరి చేస్తున్నారు. తక్కువ వేతనానికి వస్తుండడంతో ఆయా యజమానులు వీరిని పనిలో పెట్టుకుంటున్నారు. మరికొందరు రోడ్లపై భిక్షాటన చేసుకుంటున్నారు. దీంతో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు బాల కార్మిక శాఖ, పోలీసు శాఖలు సంయుక్తంగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రతి ఏడాది జనవరి, జూలైలో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు చేపట్టి బాల కార్మికులను గుర్తించి, వారిని వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పిస్తున్నారు.

గతేడాది 3,076 చిన్నారులకు విముక్తి

ప్రతి ఏడాది జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను చేపడుతున్నారు. కాగా, ఈ కార్యక్రమాల ద్వారా 2024లో 3,076 చిన్నారులకు విముక్తి కల్పించారు. ఇందులో 2,772 మంది బాలురు ఉండగా, 304మంది బాలికలు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే 1,490 మంది బాల కార్మికులు ఉండడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 2,856 మంది చిన్నారులను ఇండ్లకు పంపించామని, 220 మంది రెస్క్యూ హోం లో ఉంటున్నారని, మరో 281 మందిని పాఠశాలలో చేర్పించామని అధికారులు తెలిపారు. కాగా, గతేడాది మొత్తం 2,326 వాణిజ్య సంస్థలపై కేసులు నమోదు చేసిన అధికారులు.. వారి నుంచి రూ. 40.25 లక్షల పెనాల్టీ వేశారు. ఆ నిధులను బాల కార్మికుల సంక్షేమానికి వినియోగించనున్నట్లు కార్మిక శాఖ అడిషనల్ డైరెక్టర్ ఈ. గంగాధర్ తెలిపారు.

Tags:    

Similar News