కేటీఆర్ వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
లొట్టపీసు కేసు అంటూ విమర్శించిన కేటీఆర్ కు తన విచారణ లో లాయర్ ఎందుకు? అంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : లొట్టపీసు కేసు అంటూ విమర్శించిన కేటీఆర్ కు తన విచారణ లో లాయర్ ఎందుకు? అంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఏం పీక్కుంటారో పీక్కో అని చెప్పిన కేటీఆర్ కు లాయర్ల అవసరం ఏమున్నది? అంటూ నిలదీశారు. విచారణ సమయంలో పక్కన లాయర్ ఉండాలనేది తప్పనిసరి కాదన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీలో మాట్లాడుతూ.. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ వేల కోట్లు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం లో రూ.600 కోట్ల కుంభకోణం జరిగిందనేది తమ ఆరోపణ అంటూ వెల్లడించారు.
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం లో అనేక ఉల్లంఘన లు ఉన్నాయని వివరించారు. విచారణ జరిపించాలని హరీష్ రావు అసెంబ్లీ లో చేసిన డిమాండ్ ఆధారంగా నే చర్యలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇందులో ప్రివిలైజ్ మోషన్ ఇవ్వడానికి అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఫార్ములా ఈ రేస్ నుంచి కొన్ని సంస్థలు విచిత్రంగా తప్పుకున్నాయన్నారు. ఇక ఇంటి పైన డ్రోన్ ఎగురవేసినందుకు అప్పట్లో రేవంత్ రెడ్డి ని 14 రోజులు జైలు పంపించారని, ఆ సమయంలో చట్ట ప్రకారం రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారన్నారు. కానీ కేటీఆర్ లాగా లాయర్లను పెట్టుకొని హాడావిడి చేయలేదన్నారు. సిరిసిల్లలో భూ అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వస్తున్నాయని, త్వరలో అన్ని తేలుతాయన్నారు.