Ponnam: ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ ఘనత తెలంగాణదే.. మంత్రి పొన్నం ప్రభాకర్
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చిందని, హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) నగర పరిధిలో ఏటా సగటున 5 లక్షల వాహనాలు చేరుతున్నాయన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చిందని, హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) నగర పరిధిలో ఏటా సగటున 5 లక్షల వాహనాలు చేరుతున్నాయన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం డిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ అధ్యక్షతన జరుగుతున్న 42 వ రవాణా అభివృద్ది మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల విధానాన్ని ప్రకటించారు. తెలంగాణ రవాణా శాఖ అమలు చేస్తున్న పాలసీ లు తదితర అంశాలను మంత్రి వివరించారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధి విధానాలపైన రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసారు.
రోడ్డు రవాణా భద్రత పట్ల కేంద్రం అనుసరిస్తున్న సాంకేతికతను అడిగి తెలుసుకున్నారు. వాహనాల నుంచి వెలువడే వాయు, శబ్ద కాలుష్యం తగ్గించేందుకు, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి మంత్రి ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్లను పరిశీలించారు. చిన్న వయస్సులోనే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ సమన్వయంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కులను ఏర్పాటు చేయాలని డిపార్ట్‌మెంట్ నిర్ణయించిందన్నారు. చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కుల ఏర్పాటుకు 52 పాఠశాలలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ జాతీయ రహదారి భద్రతా మాసంలో ఈ చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, మేడ్చల్ ప్రాంతంలో ఇటీవల 40 ఎకరాల ప్రభుత్వ భూమిని రవాణా శాఖ సేకరించిందని తెలిపారు.