పనుల్లేవు, పట్టించుకోరు.. ప్రజావాణి చుట్టూ నాయకులు
కూకట్‌పల్లి నియోజకవర్గంలో పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన ఒక లెక్క, ఈ ఏడాది కాంగ్రెస్ పాలన ఒక లెక్క అన్న చందంగ అధికారుల వ్యవహార శైలి మారింది....
దిశ, కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గంలో పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన ఒక లెక్క, ఈ ఏడాది కాంగ్రెస్ పాలన ఒక లెక్క అన్న చందంగ అధికారుల వ్యవహార శైలి మారింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడం లేదంటూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, కార్పొరేటర్లు జోనల్ కమిషనర్, డీసీల చుట్టు తిరుగుతుంటే అధికార పార్టీ నాయకులు సైతం వినతిపత్రాలు తీసుకుని జోనల్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఓ విభాగంలో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే అధికారి పట్టించుకోవడం లేదంటూ అధికార పార్టీ బ్లాక్ అధ్యక్షుడే ప్రతి సోమవారం ప్రజావాణి చుట్టూ చక్కర్లు కొడుతున్నారంటే కూకట్‌పల్లి నియోజకవర్గంలో పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం అవుతుంది.
అధికారుల తీరుపై ఆరోపణలు..
కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఏడాదిగా ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదు, ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయంటూ కొన్ని రోజులుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారుల తీరుపై మీడియా ముఖంగానే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అంతే కాకుండా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టండి అంటూ ఇప్పటికే కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేశ్ సైతం జోనల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రాలు ఇస్తూ వస్తున్నారు. అంతే కాకుండా కూకట్‌పల్లి, మూసాపేట్ సర్కిళ్ల పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తమను లెక్కచేయడం లేదు, ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదంటూ ఓ నియోజకవర్గ నాయకులు ప్రజావాణి చుట్టూ తిరుగుతుంటే మరో నాయకుడు ఏకంగా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ 2024 డిసెంబర్ 16 లోకాయుక్తను ఆశ్రయించడం గమనార్హం. అధికారులు మా మాట వినడం లేదు వారిని బదిలి చేయండి అంటూ అధికార పార్టీ నాయకులు అధిష్టానాన్ని కోరుతూ లేఖలు సమర్పించుకుంటున్నారని సమాచారం.
వీధి దీపాలు లేవు, చెత్త కుప్పల కంపు..
కూకట్‌పల్లి, మూసాపేట్జంట సర్కిళ్ల పరిధిలో ఏ నాయకుడు పర్యటించాలన్న, పాదయాత్ర చేయాలన్న అధికార పక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ప్రజలు ఓ ఆట ఆడుకుంటున్నారని టాక్ వినబడుతోంది. కాలనీలలో వీధి దీపాలు వెలగడం లేదు, ఫాగింగ్ నిర్వహించడం లేదు, పొంగుతున్న డ్రైనేజి, గుంతలు పడిన రోడ్లు చూపిస్తూ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారంటూ నాయకులు బెంబేలెత్తుతున్నారు.
అధికారుల తీరు వేరు..
కూకట్‌పల్లి, మూసాపేట్ జంట సర్కిళ్లలో అధికారుల తీరుతో నాయకులే కాదు, ప్రజలు విస్తుపోతున్నారు. అధికారులు స్పందించడం లేదని ప్రజలు ప్రజావాణిని ఆశ్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూకట్‌పల్లిలో ప్రజా వాణిలో ప్రతి వారం 15 నుంచి 20కి పైగా ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. అందులో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా జంట సర్కిళ్ల పరిధిలో వందలాది సంఖ్యలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్‌లు అధ్వాన్నంగా తయారైన అధికారులు పర్యవేక్షించడం లేదని, పని జరగకున్న ప్రతినెల లక్షలాది రూపాయలు మేయింటనెన్స్ చార్జీల రూపంలో బిల్లులు ఎత్తుకుని పంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని రోజుల క్రితం నాలాలో పడి పదేండ్ల చిన్నారి ముజమిల్ మృతిచెందాడు. నాలాకు ఫెన్సింగ్ కూలిపోయింది, చర్యలు తీసుకోమని పలుమార్లు విన్నవించిన అధికారులు స్పందించక పోవడంతోనే చిన్నారి మృతిచెందినట్టు ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఆరోపించారు.