కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అధికారుల నిర్లక్ష్యం.. రికమండ్ చేసిన ఫైళ్లనూ పరిశీలించని వైనం

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులు చొరవ చూపడం లేదు. కొందరు అదనపు కలెక్టర్లు వారి లాగిన్ లోకి వచ్చిన ఫైళ్లు చూడడానికి నెలల సమయం తీసుకుంటున్నారు.

Update: 2025-01-05 02:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులు చొరవ చూపడం లేదు. కొందరు అదనపు కలెక్టర్లు వారి లాగిన్ లోకి వచ్చిన ఫైళ్లు చూడడానికి నెలల సమయం తీసుకుంటున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్.. కలెక్టర్లకు సర్క్యులర్లు జారీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. కొన్ని వారాల పాటు ప్రతి శనివారం రివ్యూ చేసి, ఆ తర్వాత పట్టించుకోలేదు. దాంతో ఎక్కడి అప్లికేషన్లు అక్కడే నిలిచిపోయాయి. కొన్ని దరఖాస్తులు ఏడాదిగా, మరికొన్ని రెండేళ్లుగా అండర్ వెరిఫికేషన్ అని చూపిస్తున్నాయి. తాజాగా మరో సర్క్యులర్ జారీ చేసి అదనపు కలెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కానీ పరిష్కరించాలన్న ఉద్దేశ్యమే లేనప్పుడు తహశీల్దార్/ఆర్డీవో/అదనపు కలెక్టర్/కలెక్టర్.. ఎవరి చేతిలో అధికారాలు పెట్టినా బాధితులకు న్యాయం దక్కుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా రికమండెడ్ ఫైళ్ల సంఖ్య 25 శాతం కూడా లేదని సమాచారం. తహశీల్దార్లు, ఆర్డీవోలు రికమండ్ చేస్తూ ఫైల్ అదనపు కలెక్టర్లు, కలెక్టర్లకు పంపినా వాళ్లు వాటిని పరిశీలించడం లేదు. రెండేండ్ల క్రితం రికమండ్ చేస్తూ పంపిన ఫైళ్లపైనా అండర్ వెరిఫికేషన్ అనే చూపిస్తుండడం గమనార్హం. ఈ సమస్య రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, నల్లగొండ, హన్మకొండ జిల్లాల్లో అధికంగా కనిపిస్తున్నది. సామాన్య రైతులు వారిని కలిసే వీల్లేదు. కలిసినా మా సమస్యని ఎందుకు పరిష్కరించడం లేదని గట్టిగా అడిగే ధైర్యం చేయడం లేదు. ఏమైనా అంటే మళ్లీ రిజెక్ట్ చేస్తారేమోనన్న భయం దరఖాస్తుదారులను పట్టి పీడిస్తున్నది. ఇప్పుడేమో భూ భారతి వచ్చే దాకా ఆగాల్సిందేనంటూ బూచీ చూపిస్తున్నారు. నిజానికి పెండింగ్ అప్లికేషన్లకు, భూ భారతి అమలుకు సంబంధమే లేదు.

వేరే మాడ్యూల్ లో అప్లయ్ చేయాలి

‘సార్.. మేం అప్లికేషన్ పెట్టుకొని నెలలు గడుస్తున్నది.. కాస్త చూడండి’ అంటూ వేడుకుంటే ‘పైకి రాశాం. మీ ఫైల్ పై డౌట్స్ ఉన్నాయి. ఎలా చేయాలో కలెక్టర్ ని అడుగుతూ లెటర్ పంపాం’ అని తహశీల్దార్లు జవాబిస్తున్నారు. ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో ఓ ప్రాజెక్టు కింద భూ సేకరణ చేశారు. రైతుకు సర్వే నంబరులో 1.20 ఎకరాలు ఉంది. దాంట్లో 0.20 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుంది. అయితే ధరణిలో మాత్రం 1.20 ఎకరాలను డిలీట్ చేశారు. తనకు రావాల్సిన ఎకరం భూమి కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి పెండింగ్ పెట్టారు. గట్టిగా అడిగితే సేకరించిన భూముల వివరాలేవీ తమ దగ్గర లేవని, వివరాల కోసం కలెక్టర్ కి లెటర్ పెట్టాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత క్లియర్ చేస్తామన్నారు. ఆర్డీవోకు డిప్యూటీ తహశీల్దార్ రిపోర్ట్ పంపితే, ఈ మాడ్యూల్ లో అప్లయ్ చేస్తే ఎట్లా? వేరే మాడ్యూల్ లో మళ్లీ అప్లయ్ చేయాలంటూ రిజెక్ట్ చేశారు. ఏ మాడ్యూల్ లో అప్లయ్ చేస్తే ఏంటి? దరఖాస్తుదారుడు అడుగుతున్నది వాస్తవమా? కాదా? అన్న అంశానికి ఆర్డీవో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. నిజానికి ఈ పని సీసీఎల్ఏ ఆదేశాల ప్రకారం దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 20 రోజుల్లో పని పూర్తి కావాలి. కానీ ఇప్పటికే నెలలు గడుస్తున్నది. ఇలాంటి బాధితుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో ఉన్నారు.

పరిశీలనకు ఎంత కాలం?

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో అప్లికేషన్ నం.2200061840 ద్వారా నిదురం చంద్రమ్మ 2022 జూలై 4న అప్లయ్ చేసుకున్నారు. రెండేండ్లయ్యింది. ఇప్పటికీ అండర్ వెరిఫికేషన్ చూపిస్తున్నది. అలాగే 2200079641, 2200061810 లు కూడా అండర్ వెరిఫికేషన్ గానే ఉంచారు. 2200054925 అప్లికేషన్ రెండేండ్ల తర్వాత డేటా ఎంట్రీకి ప్రొసీడ్ అన్నారు. కానీ ఇప్పటికీ కాలేదు. చౌలపల్లిలో ఒకాయన 2022 నవంబరు 25న అప్లై చేస్తే నేటికీ నోటీసు జనరేట్ చేశారు. పోమలపల్లిలో ఓ మహిళా రైతు 2022 ఆగస్టు 8న అప్లై చేస్తే పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ అదనపు కలెక్టర్ ఆమోదించకుండా పెండింగులో పెట్టారు. ఉప్పునూంతలలో ఒకాయన అప్లికేషన్ ని రెండేండ్ల తర్వాత రిజెక్ట్ చేశారు. కారణాలేమీ తెలియదు.

నిదురం చెన్నమ్మ భర్త చెన్నరాయుడు. ఐతే రెవెన్యూ రికార్డుల్లో నిదురం చెంద్రమ్మ భర్త చెన్నయ్య అని పడింది. దీన్ని సవరించడానికి ఎంత సేపు పడుతుంది? 2022 జూలై ఏడో తేదీన అప్లై చేశారు. 2008 లో కొనుగోలు చేసినట్లుగా సేల్ డీడ్, అందులోని పేర్లను పరిశీలించారు. ఈసీ, కొత్త ఆర్వోఆర్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్.. అన్నీ చూశారు. అన్నింట్లో కరెక్టుగానే ఉన్నది. ధరణి రికార్డుల్లోనే తప్పుగా నమోదు చేశారు. ఇదేమీ చెన్నమ్మ చేసిన తప్పు కాదు. పక్కాగా రెవెన్యూ అధికారులు చేసిందే. కానీ అధికారులు చేసిన తప్పును రుజువు చేయడానికి దరఖాస్తుదారులే అన్ని ఆధారాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ రికమండ్ చేశారు. ఆర్డీవో కూడా రికమండెడ్ అని రాసి సంతకాలు చేసి కలెక్టరేట్ కి పంపి రెండేండ్లవుతుంది. కానీ అదనపు కలెక్టర్ చూడరు. కలెక్టర్లకు తీరిక లేదు. ఈ సామాన్య మహిళా రైతు ఇంకెంత కాలం ఓపిక పట్టాలి?

– రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలం ఎలిమినేడులో ఓ పట్టాదారుడు పాసు బుక్ లో విస్తీర్ణం తక్కువగా వచ్చిందని, సరి చేయాలంటూ రెండేండ్ల కిందటే అప్లై చేసుకున్నారు. ఎన్నెన్నో తిప్పలు పడిన తర్వాత కింది స్థాయి అధికారులు దయతలిచారు. సేత్వార్, 1954–55 నుంచి 2014–15 వరకు పహాణీలు, ఆర్వోఆర్ రికార్డులు వెరిఫై చేసి ఆర్ఎస్ఆర్ లో ఎలాంటి తేడా లేదు. ఆయన సేల్ డీడ్స్ కూడా కరెక్టుగానే ఉన్నాయి. ఆయనకు రావాల్సిన విస్తీర్ణం పాసు బుక్ లో చేర్చాలంటూ తహశీల్దార్ రికమండ్ చేశారు. దానికి సంబంధించిన సేల్ డీడ్, మ్యుటేషన్ ఆర్డర్, కొత్త పాసు బుక్, పాతది, పహాణీలు.. అన్నీ జత చేశారు. కొన్ని నెలల తర్వాత ఆర్డీవో కూడా పరిశీలించిన రికమండ్ చేశారు. ఇక అప్లికేషన్ అదనపు కలెక్టర్ దగ్గరికి వచ్చింది. సామాన్యుడు కలెక్టరేట్ కి వెళ్లి ఆయన దర్శనం చేసుకొని నా ఫైల్ ఉందని, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోగలడా? కనీసం తహశీల్దార్, ఆర్డీవోలు రిపోర్ట్ రాశారని, రికమండ్ చేశారని చెప్పుకునే వీలుందా? అనేది ప్రశ్న. ఒక్క సవరణ కోసం రెండేండ్లు తిప్పించుకోవడంతో అధికారులపై విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా గట్టిగా అడిగితే రికమండెడ్ ఫైల్ ని కూడా అదనపు కలెక్టర్ లేదా కలెక్టర్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే వారి దయాదాక్షిణ్యాల కోసం దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

అధికారులు పరిష్కరించాల్సిన గడువు

తహశీల్దార్                7 రోజులు

ఆర్డీవో                      3 రోజులు

అదనపు కలెక్టర్       3 రోజులు

కలెక్టర్                      7 రోజులు

నోట్: 9 నెలల తర్వాత జారీ చేసిన సర్క్యులర్‌లో కాల పరిమితి ఏం మారలేదు. కొన్ని ఆప్షన్లు అదనపు కలెక్టర్ల చేతికి ఇవ్వడం మినహా త్వరితగతిన పరిష్కరించాలన్న ఉద్దేశ్యమే లేదు. అయితే నిర్దేశిత కాల పరిమితి లోగా పరిష్కారానికి నోచుకున్న అప్లికేషన్ల సంఖ్య ఒక్క శాతం కూడా లేదని తెలిసింది. దరఖాస్తు చేసుకున్న ఏడాదికి కూడా పరిష్కారానికి నోచుకోని అప్లికేషన్లు కూడా ఉన్నాయి. దరఖాస్తు పెట్టుకున్న తేదీ, పరిష్కరించిన తేదీ.. ఈ రెండు పరిశీలిస్తే ఎంత కాలం బాధితులను అధికారులు వేధిస్తున్నారో అర్ధమవుతుంది.

Tags:    

Similar News