Red Salute Rally: రెడ్ సెల్యూట్.! తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరులకు గుర్తుగా సీపీఐ ర్యాలీ

రాజధాని నగరం హైదరాబాద్ లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరులను (Telangana Armed Struggle Commemoration Rally) స్మరించుకుంటూ.. సీపీఐ పార్టీ(communist party of india) రెడ్ సెల్యూట్ ర్యాలీని నిర్వహించింది.

Update: 2024-09-11 11:37 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజధాని నగరం హైదరాబాద్ లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరులను(Telangana Armed Struggle Commemoration Rally) స్మరించుకుంటూ.. సీపీఐ పార్టీ(communist party of india) రెడ్ సెల్యూట్ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీకి అనేక మంది కవులు, కళాకారులు, ఇంకా పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్టీ పెద్దలు, కార్యకర్తలు రెడ్ షర్ట్స్ ను ధరించి.. మగ్దూం మొహియుద్దీన్ విగ్రహం నుంచి మొదలుకొని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ర్యాలీలో సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు, చాడ వెంకట రెడ్డి ఇంకా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. "ఈ రోజు ప్రపంచంలోనే సాయుధ పోరాటాన్ని గుర్తించిన రోజు అని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రోజని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా సాయుధ పోరాటం చేసిన వారిని తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఉందని, వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలిపారు. అయితే రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎంఐఎం పార్టీ బ్లాక్ మెయిల్ కు భయపడుతున్నాయి" అని  నారాయణ విమర్శించారు.

తదనంతరం, ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. "ఆనాడు సాయుధ పోరాటం జరగకపోయి ఉంటే తెలంగాణ భారత్ లో విలీనమయ్యేది కాదని అన్నారు. ఈ పోరాటాన్ని పక్క రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా జరుపుతున్నాయని, కానీ ఇక్కడ ప్రభుత్వాలు మాత్రం ఆరెస్సెస్, ఎంఐఎం లకు భయపడి అధికారికంగా జరపడంలేదని వ్యాఖ్యానించారు. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో లేనివారు హిందూ, ముస్లింల మధ్య గొడవలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోరాటాన్ని గురించి నేటితరం వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే దీనిని సిలబస్ లో పొందుపరచాలని" ఈ సందర్భంగా కూనంనేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ.. "ఈ రోజు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి లు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజని, సాయుధ పోరాటమే లేకపోతే.. తెలంగాణ మరో పాకిస్థాన్ గా ఉండేదని అన్నారు. ఈ పోరాటానికి గుర్తుగా హైదరాబాద్ లో స్మృతివనం ను ఏర్పాటు చేయాలి" అని చాడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Similar News