రియల్ ఎస్టేట్‌ను శాసిస్తున్న జీరో ఫైనాన్స్.. RBI రూల్స్ డోంట్ కేర్!

జిల్లాలో రియల్ ఎస్టేట్‌ను జీరో ఫైనాన్స్ శాసిస్తోంది. కొందరు వైద్యులు, బిల్డర్లు, వ్యాపారులు కుమ్మకై రియల్ వెంచర్ ఏర్పాటు చేసే వారికి, ప్లాట్లు అమ్మకాలు చేసే వారికి, ఇంటి నిర్మాణాలు చేసే వారికి అప్పులు ఇచ్చి చక్రవడ్డీలు వసూల్ చేస్తున్నారు.

Update: 2024-03-19 03:10 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రియల్ ఎస్టేట్‌ను జీరో ఫైనాన్స్ శాసిస్తోంది. కొందరు వైద్యులు, బిల్డర్లు, వ్యాపారులు కుమ్మకై రియల్ వెంచర్ ఏర్పాటు చేసే వారికి, ప్లాట్లు అమ్మకాలు చేసే వారికి, ఇంటి నిర్మాణాలు చేసే వారికి అప్పులు ఇచ్చి చక్రవడ్డీలు వసూల్ చేస్తున్నారు. అసలు, వడ్డీ చెల్లించకపోతే తనాఖా పెట్టిన భూములను తమ పేరుపై బదలాయించుకుంటున్నారు. ఎక్కడ కూడా ఆర్‌బీఐ సూచించిన నిబంధనలు గానీ, ఫైనాన్స్ నిబంధనలు గాని పట్టించుకోకుండా జీరో ఫైనాన్స్‌ను జోరుగా నడిపిస్తున్నారు. నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రా, బర్థీపూర్ శివారులోని 16 ఎకరాల 20 గుంటల భూమి డెవలపర్స్ వ్యవహరంలో పోలీసులు కేసు కావడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నగరానికి చెందిన నలుగురు డెవలపర్స్ రైతులు వద్ద కొనుగోలు చేసిన భూమిని తమ అవసరం నిమిత్తం తీసుకున్న 15 కోట్ల అప్పును మూడు కోట్ల వడ్డీ చెల్లించినా సదరు భూమిని వడ్డీ వ్యాపారులే కబ్జా చేసిన ఉదంతం ఇటీవల కలకలం రేపిన విషయం తెల్సిందే. ఈ ఉదంతంలో పేరు మోసిన వైద్యుడు, వ్యాపారులు ఉండగా వారు ఇచ్చిన అప్పులను చూస్తే నోరేళ్లబెట్టాల్సిందే. కోట్ల రూపాయల అప్పులు ఇస్తున్న సంబంధిత డబ్బులు తాలుకు ఐటి రిటర్న్ కానీ, ఎలాంటి డాక్యుమెంట్ లేకుండానే దందా నడపడం విశేషం.

నిజామాబాద్ నగర శివారులోని నడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ వైద్యుడు తాను అప్పు ఇచ్చిన మొత్తానికి భూమిని చెరబట్టాడు. సంబంధిత భూమిని వెంచర్ చేసిన రియల్ వ్యాపారి గత కొన్ని సంవత్సరాలుగా కనిపించకుండా పోయాడు. నిజామాబాద్ నగరంలోని న్యాల్‌కల్ రోడ్డులో ఒక భూమి వ్యవహరంలో ఒక పార్టీ నగర అధ్యక్షుడు కూడా ఇదే తరహాలో అప్పు ఇచ్చిన వారి భూములను తన ఖాతాలో జమ చేసుకుని ప్లాట్లను విక్రయించాడు. అదే విధంగా పాంగ్రాలో రైతుల వద్ద డెవలప్‌మెంట్ కోసం భూమిని తీసుకుని వారికి కొంత మొత్తం చెల్లించి వారినే భాగస్వాములుగా చూయించి వారి నెత్తిపైనే చెయ్యి పెట్టారు. అక్కడ కాలువ భూములను కలుపుకుని రోడ్డు చేసి ప్లాట్లను అమ్ముకున్న వ్యవహరం ఇటీవల వెలుగు చూసింది. గంగాస్థాన్‌లో భూముల ధరల పెరుగుదలకు వడ్డీ వ్యాపారులే కారణమని చెప్పాలి. తమకు చెందిన వ్యవసాయ, ప్లాట్లను బిల్డర్‌లకు డెవలపర్లకు ఇచ్చి వారు నిర్ణీత సమయంలో డబ్బులు చెల్లించకపోతే భూములకు, నిర్మాణాలకు రెండింతల ధరలు పెంచి ఆకాశానికి ధరలు అంటేలా చేసిన విషయం అందరికీ తెలిసిందే.

వడ్డీ వ్యాపారుల చేతుల్లో...

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో, ఆర్మూర్‌లో ఈ తరహా వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల్లో డజన్ల కొద్ది వెంచర్లు, ప్లాట్లు చిక్కుకుపోయాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సివిల్ మ్యాటర్ అంటూ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. భూములలో అక్రమంగా ప్రవేశించిన వారిపై కేసులు పెట్టాలంటే బాధితులకు ఒక విధంగా, వ్యాపారులకు మరొక విధంగా న్యాయం జరుగుతుందని వాదనలున్నాయి. ఇతరులు భూములను కబ్జా చేస్తే ప్రేక్షక పాత్ర వహించే పోలీసులు, రియల్టర్లు, వడ్డీ వ్యాపారులు చెప్పిందే తడువుగా ఇన్ లీగల్ ట్రేస్ పాస్ కేసులను నమోదు చేస్తారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డులో ప్రధానంగా కలెక్టరేట్ వద్ద భూముల విషయంలో గతంలో పని చేసిన ఒక ఎస్సై ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు ఇన్ లీగల్ ట్రేస్ పాస్ కేసులు తన హయంలో 50 వరకు నమోదు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే భూమి వివాదంలో 20కి పైగా ఎఫ్ ఐఆర్ లు నమోదయ్యాయంటే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వడ్డీ వ్యాపారులు జీరో ఫైనాన్స్ పేరిట దందాలు చేసుకుని రియల్టర్లు వడ్డీలు చెల్లించకపోతే భూములను గుంజుకుంటున్నారు. కొందరు వైద్యులు, బిల్డర్లు, వ్యాపారులు కుమ్ముక్కు కావడంతో రియల్ వెంచర్ ఏర్పాటు చేసే వారికి, ప్లాట్లు అమ్మకాలు చేసే వారికి, ఇంటి నిర్మాణాలు చేసే వారికి అప్పులు ఇచ్చి చక్రవడ్డీలు వసూల్ చేస్తున్నారని, అవి చెల్లించని పక్షంలో తనాఖా పెట్టిన భూములను తమ పేరుపై బదలాయించుకుని యజమానులనే రానివ్వని గడ్డు పరిస్థితి నెలకొంది.


Similar News