కేంద్ర మంత్రి ఖట్టర్‌కు తెలంగాణ ప్రతిపాదనలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉనికిలోకి రానున్న మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌ (50:50 నిష్పత్తిలో)గా చేపట్టాలన్న ఆలోచనను కేంద్రంతో పంచుకున్నారు.

Update: 2024-10-07 17:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉనికిలోకి రానున్న మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌ (50:50 నిష్పత్తిలో)గా చేపట్టాలన్న ఆలోచనను కేంద్రంతో పంచుకున్నారు. మొత్తం 76.4 కి.మీ. మేర ఐదు పాకెట్లలో (లైన్‌లు) నిర్మాణమయ్యేలా డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను రూపొందించామని, ఇందుకు రూ. 24,269 కోట్ల మేర ఖర్చవుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు వివరించారు. డీపీఆర్‌ను త్వరలోనే సమర్పి,చనున్నామని, వీలైనంత తొందరగా ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేలా సహకరించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయనతో సోమవారం సాయంత్రం భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరికొన్ని అంశాలపైనా మెమొరాండంలు సమర్పించారు. హైద‌రాబాద్ నగరం ఏటేటా విస్తరిస్తూ ఉన్నందున స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్టర్ ప్లాన్‌ను(సీఎస్ఎంపీ) రూపొందించాల్సిన అవసరం ఏర్పడిందని, శివారు మున్సిపాలిటీలకు కూడా ఇదే తరహా వ్యవస్థను కల్పించాల్సి ఉన్నదని, అందువల్ల అమృత్ 2.0 స్కీమ్‌లో దీన్ని చేర్చాల‌ని కోరారు. లేదంటే ప్రత్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేయాలని కోరారు.

హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా సెకండ్ ఫేజ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసిందని, దీనికి ఆమోదం తెలపడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం వ్యయాన్ని భరించేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రికి సీఎం రిక్వెస్టు చేయడంతో పాటు కొన్ని వివరాలను అందించారు. నాగోల్ నుంచి శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్రయం మార్గాన్ని (36.8 కి.మీ.), రాయ‌దుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్‌-చాంద్రాయ‌ణ‌గుట్ట (7.5 కి.మీ.), మియాపూర్‌-ప‌టాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీన‌గ‌ర్‌-హ‌య‌త్‌న‌గ‌ర్ (7.1 కి.మీ.) చొప్పున మొత్తం 76.4 కి.మీ. మేర డీపీఆర్‌లు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలోనే ఈ డీపీఆర్‌ను సమర్పిస్తామని వివరించారు. ఈ ఐదు కారిడార్ల నిర్మాణానికి దాదాపు రూ.24,269 మేర ఖర్చు కానున్నట్లు అంచనా వేశామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన నిష్పత్తి (50:50)లో జాయింట్ వెంచ‌ర్‌గా చేప‌ట్టాల‌ని భావిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సహకారం కావాలని సీఎం రిక్వెస్టు చేశారు.

హైద‌రాబాద్ నగర విస్తరణను పరిగణనలోకి తీసుకుని స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్‌ను (కాంప్రహెన్సివ్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్) రూపొందించామని, దీన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 స్కీమ్‌లో చేర్చాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అలా వీలుకాని పక్షంలో దీన్ని ప్ర‌త్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కోరారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి దీర్ఘకాల చరిత్ర ఉన్నదని, శతాబ్దాలు దాటిని పురాత‌న మురుగునీటి శుద్ధీకరణ వ్య‌వ‌స్థ‌ కొనసాగుతున్నదన్నారు. ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా మార్చేందుకే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామన్నారు. హైద‌రాబాద్ సిటీతో పాటు శివారులో ఉన్న స‌మీప‌ పుర‌పాల‌క సంఘాల్లోనూ స‌రైన మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థ లేద‌ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు ప్ర‌పంచ స్థాయిలో ఉండేందుకు వీలుగా న‌గ‌రంతో పాటు స‌మీప మున్సిపాలిటీల్లో 100% ద్ర‌వ వ్య‌ర్థాల (లిక్విడ్ వేస్ట్) శుద్ధి చేయాల్సిన అవ‌సరం ఉంద‌న్నారు. మొత్తంగా 27 పుర‌పాల‌క సంఘాల‌తో క‌లిపి 7,444 కి.మీ. మేర రూ.17,212.69 కోట్ల‌తో సీఎస్ఎంపీకి డీపీఆర్ రూపొందించిన‌ట్లు సీఎం వివరించారు. అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక స‌హాయం చేయ‌డమో లేక ప్ర‌త్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వడమో చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 55 కి.మీ. మేర మూసీ న‌ది ప్ర‌వ‌హిస్తున్నద‌ని, ఇరువైపులా క‌లిపి 110 కి.మీ.మేర న‌గ‌రంలోని మురుగు అంతా మూసీలోకే చేరుతున్నదని తెలిపారు. ఇకపైన మురుగు నీరు, లిక్విడ్ వేస్ట్ మూసీ నదిలోకి చేర‌కుండా ఉండేందుకు ట్రంక్ సీవ‌ర్స్ మెయిన్స్‌, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్ విధానాలను అమలు చేయడంతో పాటు కొత్త సీవ‌రేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను కూడా నిర్మించాల్సి ఉంటుందని వివరించారు. ఈ నిర్మాణాలకు దాదాపు రూ.4 వేల కోట్ల‌తో డీపీఆర్‌ను రూపొందించిన‌ట్లు కేంద్ర మంత్రికి వివరించి ఆ ప్రతిని అందజేశారు. వెంటనే ఈ డీపీఆర్‌కు ఆమోదం తెలపడంతో పాటు పనులు సత్వరం కార్యరూపం దాల్చేందుకు అనుమ‌తి ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ముఖ్య‌మంత్రి వెంట న‌ల్లగొండ‌, భువ‌న‌గిరి, పెద్ద‌ప‌ల్లి ఎంపీలు ర‌ఘువీర్ రెడ్డి, చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, వంశీకృష్ణ‌, ఢిల్లీలో తెలంగాణ‌ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి జితేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు శ్రీ‌నివాస‌రాజు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌దర్శి శేషాద్రి, పురపాల ముఖ్య కార్య‌ద‌ర్శి దాన కిశోర్‌, హైద‌రాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్పల్ ఉన్నారు.


Similar News