Deputy CM Bhatti: ఇంజినీర్లకు అవగాహన కల్పించండి
రాష్ట్ర ప్రజలకు రాబోయే ఏడు సంవత్సరాలకు కావాల్సిన విద్యుత్‌ను సరఫరా చేయడానికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు రాబోయే ఏడు సంవత్సరాలకు కావాల్సిన విద్యుత్‌ను సరఫరా చేయడానికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ట్రాన్స్ కో సంస్థను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఉన్నతాధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 15,700 మెగావాట్ల విద్యుత్ పీక్ డిమాండ్ ఉందని, రాబోయే ఏడు సంవత్సరాలకు 27 వేల మెగావాట్లకు పీక్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. ఆ అంచనాకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేయడానికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించుకొని కార్యాచరణను వెంటనే అమలు చేయాలని అన్నారు. ట్రాన్స్ కో ఆధ్వర్యంలో చేపడుతున్న సబ్ స్టేషన్ల నిర్మాణం పనుల గురించి ఆయన ఆరా తీశారు. సబ్ స్టేషన్ల పనుల నిర్మాణానికి నిర్ణీత గడువు లక్ష్యంగా పెట్టుకొని పని చేయాలని సూచించారు. రాబోయే రెండు సంవత్సరాల్లో సంస్థపరంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి లోతుగా సమీక్షించారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకొని సంస్థలు బలోపేతం చేసుకోవాలని సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ట్రాన్స్ కోలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎనర్జీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ ను ఆదేశించారు. సంస్థలో పనిచేస్తున్న ఇంజనీర్లకు అధునాతన టెక్నాలజీ పైన అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. ట్రాన్స్ కో సంస్థ బలంగా ఉన్నప్పుడే విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంటుందన్నారు. సంస్థను ఆర్థికంగా బలంగా ముందుకు తీసుకోవడానికి డైరెక్టర్ నుంచి ఏఈ స్తాయి వరకు ఉన్న అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ట్రాన్స్ కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్ల నిర్మాణం తదితర అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎనర్జీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఐఏఎస్, ట్రాన్స్ కో జె ఎండీ శ్రీనివాసరావు, ట్రాన్స్ కో డైరెక్టర్లు జీ నర్సింగరావు, సూర్య ప్రకాష్, నర్సింగరావు, సీఈ, ఎస్ఈ తదితరులు ఉన్నారు.