కాళోజీ వర్సిటీ రెండో విడత కౌన్సిలింగ్ సీట్ల ప్రకటన

మొదటి విడత కౌన్సిలింగ్‌తో పోలిస్తే.. ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సిలింగ్‌లో ఎక్కువ మంది విద్యార్ధులకు సీట్లు లభించాయి.

Update: 2024-10-07 16:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మొదటి విడత కౌన్సిలింగ్‌తో పోలిస్తే.. ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సిలింగ్‌లో ఎక్కువ మంది విద్యార్ధులకు సీట్లు లభించాయి. కన్వీనర్‌ కోటాలో అధిక ర్యాంకులు వచ్చినా, సీట్లు దక్కుతున్నట్లు కాళోజీ వర్సిటీ అధికారులు సోమవారం తెలిపారు. ఈసారి బీసీ-ఏ కేటగిరీలో గరిష్టంగా 3.35 లక్షల నీట్‌ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఒక ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో కన్వీనర్‌ కోటా కింద సీటు లభించింది. ఇంత పెద్ద ర్యాంకుకు సీటు రావడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అని కాళోజీ వర్గాలు వెల్లడించాయి. ఆ తరువాల ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి మరో ప్రైవేట్‌ కాలేజీలోని కన్వీనర్‌ కోటా సీటు లభించింది. ఎస్టీ కేటగిరీలో 2.89 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. బీసీ-బీలో 2.27 లక్షలు, బీసీ-సీలో 3.14 లక్షలు, బీసీ-డీలో 2.13 లక్షలు, బీసీ-ఈలో 2.24 లక్షల గరిష్ట ర్యాంకులు సాధించిన వారికి సీట్లు లభించాయి. ఇక ఓపెన్‌ కేటగిరీలో 1.94 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో గరిష్టంగా 1.74 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు రావడం గమనార్హం. ఇక ఉస్మానియాలో రెండో విడతలో ఎస్టీ కేటగిరీలో 1.15 లక్షల ర్యాంకుకు సీటు వచ్చింది.

రాష్ట్రంలో 60 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఉన్న 5,653 కన్వీనర్‌ సీట్లను రెండు విడతల కౌన్సిలింగ్‌ల్లో విద్యార్థులకు కేటాయిస్తూ కాళోజీ వర్సిటీ జాబితా విడుదల చేసింది. మొదటి విడతలో 4,282 మందికి కన్వీనర్‌ కోటా సీట్లు కేటాయించారు. అందులో చేరగా మిగిలిన సీట్లకు, అలాగే మొదటి విడత కౌన్సిలింగ్‌లో కేటాయించని దివ్యాంగులు తదితర సీట్లను రెండో విడత కౌన్సిలింగ్‌లో కేటాయించారు. ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తుండటం, అలాగే, ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలు అదనంగా రావడం.. అందులో 400 ఎంబీబీఎస్‌ సీట్లు పెరగడంతో విద్యార్థులకు అవకాశాలు మరింత పెరిగాయి. దీంతో అధిక ర్యాంకు సాధించిన విద్యార్థులు ఎంబీబీఎస్‌లో సీట్లు దక్కించుకున్నారు. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సిలింగ్‌ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే కేటాయిస్తారు.


Similar News