దసరా కానుకగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

పల్లెల్లో, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

Update: 2024-10-07 17:07 GMT

దిశ, కల్వకుర్తి: పల్లెల్లో, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం కల్వకుర్తి డివిజన్‌లోని వెల్దండ, కల్వకుర్తి మున్సిపాలిటీ‌తో పాటు సిల్లారుపల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌ ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యాధునిక వసతులతో ఆర్డీవో ఆఫీసును నిర్మించి ప్రారంభిస్తామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంతోనే మార్పు సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. నిరుద్యో‌గులకు, రైతులకు, బడుగు బలహీనవర్గాలకు వ్యూహాత్మకంగా పథకాలు అమలు చేస్తామని అన్నారు.

రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని అన్నారు. మిగిలినవి చిత్తశుద్ధితో త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ‌కి అవసరమైన రూ.31వేల కోట్లతో పాటు ఆదనంగా రూ.500 కోట్లు ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ధరణి స్థానంలో బలమైన 2024 ఆర్‌ఓ‌ఆర్ చట్టం తీసుకురాబోతున్నామని అన్నారు. ప్రతి కుటుంబానికి డిజిటల్ గుర్తింపు కార్డులను ఇచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యల తీసుకుంటున్నామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అర్హులకు కేటాయిస్తామని అన్నారు. నిరుద్యోగ యువకులకు ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేశామని, భవిష్యత్తులో కూడా మరిన్ని పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ప్రజలకు మేలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనిచేస్తుందన్నారు. ఇప్పటికే నిరుద్యోగ యువతకి ఇప్పటికే 61 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గత పర్యటనలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందకు కల్వకుర్తిలో రూ.44 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు.

వేలాది మంది విద్యార్థులతో అత్యధిక తరగతి గదులతో విశాలమైన వాతావరణంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నెలకొల్పబోతున్నామని అన్నారు. ఇప్పటి వరకు రూ.18 వేల కోట్ల నిధులను రైతుల రుణమాఫీకి విడుదల చేశామని అన్నారు. త్వరలోనే మరో రూ.13 వేల కోట్లను రుణమాఫీకి ప్రభుత్వం చెల్లిస్తుందని, ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 4వేల చొప్పున ఇందిరమ్మ డబల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థినులకు ఇంటర్మీడియట్ స్థాయిని పెంచుతూ రూ.3.25 కోట్ల వ్యయంతో అదనపు తరగతి గదులు మినీ స్టేడియంలో రూ.1.30 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు.

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలవుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అడిగినట్లుగా నూతన ఆర్డీవో భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజురయ్యేలా చూస్తానని అన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో మొత్తం రూ.44 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ఈ విషయంలో కల్వకుర్తి ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. కల్వకుర్తి పట్టణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్డీవో కార్యాలయాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే మంత్రికి దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. కల్వకుర్తి పట్టణంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ నుంచి విశ్రాంతి భవనాన్ని నిర్మించాలని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, స్థానిక అధికారులు, మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News