నిందలు రూపుమాపు కొనేందుకు ప్రయత్నాలు

నవాబుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమపై వచ్చిన నిందలను రూపుమాపుకునేందుకు గురువారం శతవిధాల ప్రయత్నించారు

Update: 2024-11-28 16:43 GMT

దిశ,నవాబుపేట : నవాబుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమపై వచ్చిన నిందలను రూపుమాపుకునేందుకు గురువారం శతవిధాల ప్రయత్నించారు. బుధవారం వరకు పాఠశాల విద్యార్థినుల సహకారంతో వంట పనులు చేసి పబ్బం గడుపుతూ వచ్చిన వంట మనుషులు తమ పనితీరుపై పత్రికల్లో విమర్శనాత్మక వార్తలు రావడంతో..తల్లడిల్లిపోయి గురువారం ఉరుకులు పరుగులతో అల్పాహారం,భోజనాలు సిద్ధం చేశారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జల్సా అనే విద్యార్థిని గాయపడడానికి కారకురాలిగా నిర్ధారించి ఇంచార్జ్ స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతిని విధుల నుంచి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సస్పెన్షన్ చేయడంతో..ఆ విద్యార్థిని వెంట తీసుకొని జిల్లా కలెక్టర్ ను కలవడానికి పాఠశాల నిర్వాహకులు ప్రయత్నించినట్లుగా విశ్వసనీయ సమాచారం. కాగా సంఘటనకు సంబంధించి  వార్తలు పత్రికలలో ప్రచురించిన వారికి  పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మాధవి ఫోన్లు చేసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆమె వైఖరి వల్లే పాఠశాలలో జల్సా లాంటి విద్యార్థినులు వంట మనుషులకు సహకారం పేరుతో ఊడిగం చేస్తూ..అసౌకర్యంగా పాఠశాలలో ఆవాసం ఉంటున్నట్లు ఆరోపణలు వెల్లు వెత్తాయి. 

 పాఠశాలలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు బయటకు పొకూడదనే ఉద్దేశంతో..ఎవరిని కూడా స్పెషల్ ఆఫీసర్ మాధవి పాఠశాలలోకి అనుమతించరని,ఆమె విధులలో లేకపోవడం వల్లే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని స్థానికులు తెలిపారు.  జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని, సంఘటనకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.


Similar News