కేంద్ర బంగారు బాతు గుడ్లను ఇచ్చింది: రాణిరుద్రమ
కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి బంగారు బాతు గుడ్లను ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ వ్యాఖ్యానించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి బంగారు బాతు గుడ్లను ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం బంగారు గుడ్లు ఇచ్చింది అనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికే నిదర్శనమని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడారని ఆమె ఫైరయ్యారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా రాలేదని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
కాగ్ రిపోర్ట్ కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు చెంపదెబ్బ లాంటిదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని ఎడమ చేయితో చెంపదెబ్బ కొట్టినట్టు రిపోర్ట్ ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, తిరిగి వాపస్ అయిన నిధుల గురించి ఈ రిపోర్ట్ లో చెప్పారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బంగారు బాతు గుడ్డులాంటిదయితే.. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు స్తోత్రం జపిస్తున్నారని రాణి రుద్రమ ఎద్దేవాచేశారు. కేంద్రంను బద్నాం చేసేందుకు అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. గతంలో కేసీఆర్.., ప్రధాని మోడీ వచ్చినప్పుడు అనేక కారణాలతో కలవకుండా తప్పించుకున్నాడని, ఇప్పుడు రేవంత్.. మోడీని బడేభాయ్ అంటూ చెప్పి తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.