పార్కు మాదే, చెరువు మాదే!

రెవెన్యూ రికార్డుల ప్రకారం అది సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్. కోర్టు తీర్పులూ అలాగే ఉన్నాయి. పక్కనే ఉన్న కాలనీవాసుల ప్లాట్ల సేల్ డీడ్స్‌లోనూ ఆ స్థలాన్ని పార్కుగా చూపారు.

Update: 2023-05-15 02:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ రికార్డుల ప్రకారం అది సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్. కోర్టు తీర్పులూ అలాగే ఉన్నాయి. పక్కనే ఉన్న కాలనీవాసుల ప్లాట్ల సేల్ డీడ్స్‌లోనూ ఆ స్థలాన్ని పార్కుగా చూపారు. ఇండ్ల నిర్మాణ అనుమతుల కోసం అందజేసిన డాక్యుమెంట్లలోనూ ప్రజాప్రయోజనాల వినియోగించే స్థలంగానే పేర్కొన్నారు. కానీ తాము కొనుగోలు చేశామంటూ ఆ స్థలాన్ని కాజేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ సర్వే నంబర్ 32 లోని పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఒక మాజీ అధికారి, మరి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇదే స్థలాన్ని క్రమబద్దీకరించుకోవడానికి మరో ముఠా 60 గజాల చొప్పున ప్లాట్లు చేసి అమ్మేసింది. జీవో 59ని ఉపయోగించుకుని రెగ్యులరైజేషన్ కు ప్రయత్నిస్తున్నది. నిజానికి ఈ దరఖాస్తులన్నింటినీ గతంలోనే ఒకసారి ప్రభుత్వం తిరస్కరించింది. అయినా అక్రమార్కుల దండయాత్ర ఆగడం లేదు. ఇప్పుడు ఈ రెండు ముఠాలు మరోసారి పార్కును ఎలాగైనా కాజేయాలని కుతంత్రాలు చేస్తున్నాయి. రూ.కోట్ల విలువైన స్థలాన్ని కాపాడడంలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారుల శ్రద్ధ తీసుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధికి ఆటంకాలు

ఓ మాజీ అధికారి ఎప్పటికప్పుడు ఏవేవో ఆదేశాలు తెస్తూ జీహెచ్‌ఎంసీ అధికారులను బెదిరించి పార్కు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇటీవల ఇరిగేషన్‌ అధికారులు మేడికుంట చెరువును అభివృద్ధి చేయడంలో భాగంగా సర్వే నెంబర్ 32 లో చెరువు కట్టను అభివృద్ధి చేశారు. మిగిలిన పని పూర్తి చేసేలోగా భూకబ్జాదారులు యథాతథ స్థితిని కొనసాగించాలని ఒక కోర్టు ఆదేశం చూపించారు. దీంతో పనులు నిలిచిపోయాయి. వీరు రోడ్డుతో సహా మొత్తం స్థలాన్ని కబ్జా పెట్టేందుకు నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. వాస్తవానికి సర్వే నం.32 లోని భూమి వ్యవహారంపై వివిధ న్యాయస్థానాల్లో వివాదాలు నడిచాయి. చివరకు 1999లో హైకోర్టు జస్టిస్‌ టీసీహెచ్‌ సూర్యారావు, జస్టిస్ చంద్రన్నల ధర్మాసనం ఈ భూమికి సంబంధించిన 21 కేసులను (WP. 23382/1999) కలిపి విచారణ జరిపి ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది.

ఈ సర్వేనెంబర్ లోని భూమి అంతా సీలింగ్ భూమి అని, ప్లాట్ల యజమానులు ప్రభుత్వం నుంచి తగు రుసుము చెల్లించి అనుమతి పొందవచ్చన్నారు. ప్లాట్లు కాకుండా మిగిలి ఉన్న భూమి అంతా ప్రభుత్వానికే చెందుతుందని తీర్పులో పేర్కొన్నారు. ఈ భూమికి యజమాని విమలా వెంకటేశ్వర్‌రావు అని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ‘వెయ్యి చదరపు గజాలు మినహా మిగిలిన స్థలం భూగరిష్ఠ పరిమితి చట్టం 1976 ప్రకారం ఆటోమేటిక్‌గా ప్రభుత్వానికి చెందుతుంది.’ అని ఆ తీర్పు వెల్లడించింది. అంటే ప్లాట్లు కాకుండా మిగిలి ఉన్న భూమి పార్కు భూమి మాత్రమే. రోడ్లు పోగా 2.7 ఎకరాల భూమి పార్కు భూమిగా మిగిలి ఉంది. అందులోనే రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎకరం భూమిలో కుంట ఉండేది. కాలక్రమంలో ఆ కుంటను ఆనుకుని పక్కన ఉన్న సర్వే నంబర్ భూముల్లో మట్టి కోసం తవ్వకాలు జరపడంతో అది పెద్ద చెరువు గా మారింది.

ఇల్లీగల్ లే అవుట్..

ఆ భూమినే కొంత కాలం తర్వాత తాను లే అవుట్‌ చేసిన వ్యక్తి ద్వారా కొన్నట్టు ఓ మాజీ అధికారి చెబుతున్నారు. సర్వే నంబరు 32లో మూడెకరాల భూమిని తాను 2005లో కొన్నట్టు, యూఎల్‌సీకి దరఖాస్తు చేసుకున్నట్టు చెప్తున్నారు. అదే అంశంపై హైకోర్టు కెళ్లారు. జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ ఆయన పిటిషన్ (WP.5785/2020) ను విచారించి ‘పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం అమలులో ఉండగా మూడెకరాల భూమి ఒకరే కొనడం ఎలా సాధ్యమని’ సందేహం వ్యక్తం చేసింది. అంతే కాదు ఈ కేసులో యథాతథ స్థితి ఉత్తర్వులు ఇవ్వడానికి జడ్జి నిరాకరించారు. చాలా సందర్భాల్లో బహిరంగ స్థలాలను కబ్జా చేయడానికి యథాతథ ఉత్తర్వులను ఉపయోగించుకుంటున్నారని కూడా న్యాయమూర్తి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

భూమి హక్కు విషయం తేలాలంటే ఈ కేసులో జిల్లా కలెక్టరును ఇంప్లీడ్‌ చేసుకోవాలని పిటిషనర్‌ తరపు న్యాయవాదిని ఆదేశించారు. దీనికి ముందు జిల్లా కోర్టులో ఒక పిటిషన్‌ వేసి తాత్కాలిక ఇంజక్షన్‌ ఆర్డరు పొంది అది పర్‌పెక్చువల్‌ ఇంజక్షన్‌ ఆర్డర్‌ అని చెప్పి చాలా కాలం జీహెచ్‌ఎంసీ అధికారులను బెదిరించారు. తాజాగా జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం నుంచి యథాతథ ఉత్తర్వులను (WP.11398/2018) తీసుకున్నారు. ఆశ్చర్యకరమైన అంశమేంటంటే మాజీ అధికారి, ఇతరులు మూడెకరాల భూమి తమ ‘స్వాధీనంలో ఉందని’ కోర్టులకు చెప్పి స్వాధీన హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరారు.

రోడ్డు కూడా మాదే..

లే అవుట్‌లో రోడ్డుగా నిర్ధారించిన భూమికి కూడా తమదేనంటూ పేచీ పెడుతున్నారు. రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఈ రోడ్డును వేయడానికి జీహెచ్‌ఎంసీ 2008లోనే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక్కడ ఇంకో వైరుధ్యం కూడా ఉన్నది. హైకోర్టులో పిటిషనర్ వేసిన మరో కేసు గురించి (WP.5785/2020) ఎక్కడా ప్రస్తావించలేదు. అది పక్కా పార్క్ భూమి. మాజీ అధికారికి భూ యజమానుల నుంచి కాకుండా హక్కు లేని వారి నుంచి కొని చట్టబద్ధత లేని డాక్యుమెట్లు చూపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అది పార్కు భూమి తనదని క్లెయిమ్‌ చేస్తున్నారని చెప్తున్నారు. సైబర్‌ హిల్స్‌ కాలనీలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినప్పుడు ఆ స్థలాన్ని బహిరంగ స్థలంగా చూపించి అనుమతులు పొందడం గమనార్హం.

ప్లాట్ల స్థలం పోగా మిగిలిన స్థలం అంతా ప్రభుత్వ భూమే అని 1999లోనే జస్టిస్‌ సూర్యారావు, జస్టిస్‌ చంద్రన్నల ధర్మాసనం పేర్కొంది. అసలు భూగరిష్ఠ పరిమితి చట్టం అమలులో ఉండగా మూడెకరాల స్థలం కొనడానికి అనుమతి లేదన్న విషయాన్ని జస్టిస్‌ కోదండరామ్‌ ధర్మాసనం గుర్తు చేసింది. కబ్జా దారులు కోర్టులను తప్పుదారి పట్టించి, అధికారులను బెదిరించి భూమిని కాజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు కొందరు కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని కాలనీ వాసులు విమర్శిస్తున్నారు. పార్కు స్థలంలో పెద్ద మొత్తంలో డంపింగ్‌ వ్యర్థాలు కుమ్మరిస్తూ కాలనీని దుర్గంధ భరితంగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News