ఆపద్బాంధవులకు నిలువ జాడేది?
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడే 108 సిబ్బంది తాము మాత్రం ఉండడానికి సరైన వసతి లేక శిథిలావస్థ భవనంలో భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు.
దిశ,కేశంపేట : అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడే 108 సిబ్బంది తాము మాత్రం ఉండడానికి సరైన వసతి లేక శిథిలావస్థ భవనంలో భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. రాత్రనక పగలనక కష్టపడే ఆ ఆపద్బాంధవులకు దొరికే కొద్దిపాటి తీరిక సమయంలో కనీసం విశ్రాంతి తీసుకోవడానికి సరైన గది లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేశంపేట మండల కేంద్రంలోని 108 సిబ్బంది ఎదుర్కొంటున్న దుస్థితి ఇది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చొరవ తీసుకొని మండలానికి 108 అంబులెన్స్ ను కేటాయించేలా చూశారు. అప్పటి నుంచి మండలంలో 108 సిబ్బంది తమ సేవలను అత్యవసర పరిస్థితుల్లో మండల ప్రజలకు అందిస్తున్నారు. కాని వారికి ఉండడానికి కనీసం ఒక మంచి గది కూడా లేకపోవడం బాధాకరం.
ప్రభుత్వ ఆసుపత్రిలో శిథిలావస్థ స్థితిలో ఉండి డిస్ మెంటల్ చేయాల్సిన భవనంలోని ఒక గదిలో తమ సామాను పెట్టుకుని అది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో బయట చెట్ల కింద కాలాన్ని వెల్లదిస్తున్నారు. తమకు ఒక గదిని కేటాయించాలని ప్రభుత్వ ఆసుపత్రి వారిని అడిగిన తమకు గది కేటాయించడానికి అధికారం లేదంటూ గదులు అందుబాటులో లేవని డి ఎమ్ హెచ్ ఓ నుంచి అనుమతి తీసుకోవాలని వారు తిరస్కరిస్తున్నారని అన్నారు.ఈ విషయంపై 108 సిబ్బంది గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు, ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులకు పలుమార్లు విన్నవించిన సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత ఎమ్మెల్యే శంకరన్న అయిన తాము ఉండడానికి నిలువ నీడ చూపాలని 108 సిబ్బంది కోరుకుంటున్నారు.