తాగుబోతులకు అడ్డాగా గ్రామ సంతలు

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన కూరగాయలను గ్రామ పరిధిలోనే విక్రయించుకునేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామ సంతల నిర్మాణం చేపట్టింది.

Update: 2024-12-23 02:09 GMT

దిశ, శంకర్పల్లి: గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన కూరగాయలను గ్రామ పరిధిలోనే విక్రయించుకునేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామ సంతల నిర్మాణం చేపట్టింది. లక్షలు వెచ్చించి నిర్మించిన సంతలు గ్రామాల్లో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. శంకర్పల్లి మండలంలోని జనవాడ, దొంతాన్‌పల్లి, గోపులారం, మహారాజ్ పేట్, మహాలింగాపురం, లక్ష్మారెడ్డి గూడెం, గాజుల గూడెం, ఆలంఖాన్‌గూడ, అంతప్పగూడ, కొత్తపల్లి తదితర గ్రామాల పరిధిలో గ్రామసంతల నిర్మాణాలు చేపట్టారు. కానీ ఎక్కడ గ్రామ సంతలను వినియోగించుకోవడం లేదు. గ్రామ సంతల నిర్మాణం జరగకముందు ఎక్కడైతే కూరగాయల క్రయవిక్రయాల జరుగుతున్నాయో ప్రస్తుతం అక్కడే రోడ్లపై విక్రయాలు చేపడుతున్నారు.

తాగుబోతులకు అడ్డా..

లక్షలు వెచ్చించి నిర్మించిన గ్రామ సంతలు శునకాలకు ఆవాసాలుగా మారగా మరికొన్ని గ్రామాల్లో తాగుబోతులకు అడ్డాగా మారాయి. మరికొన్ని గ్రామాల్లో గ్రామ సంతల గేట్లు విరిగిపడి ఉన్నాయి. మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకు రాకపోవడంతో వాటి తలుపులు విరిగిపడడం తో లక్షలు వెచ్చించినా ప్రజాధనం దుర్వినియోగమైంది. వాటిని నివారించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి స్థాయి అధికారులు సైతం ఆయా గ్రామాలను సందర్శించినప్పటికీ ఇలాంటి వాటిని వినియోగంలోకి తేకపోవడంపై శ్రద్ధ కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు కేవలం మొబైల్ ఫోన్ అటెండెన్స్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆలూరు ఘటన తర్వాత మారని తీరు..

హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న వారి పైకి లారీ దూసుకెళ్లి కూరగాయలు అమ్ముకునే రైతులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ అధికారులు నేటికీ కళ్ళు తెరవకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో సైతం రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. ఆయా గ్రామాల్లో సైతం కూడళ్లలో రోడ్లపై కూరగాయలు విక్రయిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆలూరు సంఘటన జరిగిన తర్వాత అధికారులు రోడ్లపై జరుగుతున్న క్రయవిక్రయాలను గ్రామ సంతల్లోకి మార్చడానికి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి రోడ్లపై కూరగాయల విక్రయాలను ఎత్తివేసి గ్రామ సంతల్లోకి మార్చి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News