దిశ, శంషాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేసి ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే శంషాబాద్ మున్సిపాలిటీ మాత్రం వీధి కుక్కలకు అడ్డాగా మారింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా వీధి కుక్కలు స్వెర విహారం చేస్తున్నాయని స్థానికులు ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు అంటున్నారు. అయితే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధుర నగర్ కాలనీలో గురువారం ఉదయం ఏ రోడ్డులో చూసిన గుంపులు గుంపులుగా వీధి కుక్కల స్వెర విహారం చేస్తూ స్థానికులను భయభ్రాంతులను గురిచేస్తున్నాయి. ఉదయం స్కూల్ కి వెళ్లే సమయం కావడంతో తల్లిదండ్రులు పిల్లలను స్కూలుకు పంపాలన్న భయాందోళన గురవుతున్నారు. గత ఆరు నెలల క్రితం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సామా ఎన్ల్యూ వెంచర్ లో దినసరి కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించే ఓ కుటుంబం గుడిసెలో పడుకొని ఉండగా అర్ధరాత్రి వీధి కుక్కలు వెళ్లి 4 సంవత్సరాల చిన్నారిని ఎత్తుకెళ్లి కర్చి చంపేశాయి.. అయినా సరే మున్సిపాలిటీలో మాత్రం వీధి కుక్కల పై నియంత్రణ లేదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తూతూ మంత్రంగా హడావిడి చేసి రెండు రోజులు కుక్కలు పట్టుకున్నట్టు కాకుండా పకడ్బందీగా కాలనీలోని వీధి కుక్కలను పట్టుకొని ఇక్కడి నుండి తరలించి చిన్నారులను స్థానికులను కుక్కల బారి నుండి కాపాడాలని కోరుతున్నారు.