రోడ్డంతా గుంతలే.. ఆదమరిస్తే ప్రమాదమే

Update: 2024-08-30 12:58 GMT

దిశ, శంకర్ పల్లిః శంకర్ పల్లి నుంచి మోమిన్ పేట వెళ్లే రహదారిపై అడుగడుగునా గుంతలు ఉండడంతో వాహనదారులు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. శంకర్ పల్లి నుంచి మోమిన్ పేట దాకా సుమారు 28 కిలోమీటర్ల దూరంలో సుమారు 1000 వరకు గుంతలు ఉంటాయి. పేరుకే తారు రోడ్డు ఉన్నప్పటికీ అన్ని గుంతల మయంగా తయారయింది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో వాహనాలు 20 కిలోమీటర్లలోపు వేగంతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనంలో మోమిన్ పేట్ వెళ్లాలంటే సుమారు గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. శంకర్ పల్లి మండలం లక్ష్మారెడ్డి గూడ గ్రామం వద్ద 100 మీటర్ల దూరం రోడ్డు అద్వానంగా తయారైంది. దేవరంపల్లి, చీమలదరి, ఎనక తల, మైతాబ్ ఖాన్ గూడా, మోమిన్ పేటకు సమీపంలో గ్రామాల వద్ద గుంతలు ఉండడంతో వాహనదారుల ఇక్కట్లు చెప్పలేని విధంగా తయారయ్యాయి. ఇక రాత్రిపూట ప్రయాణం అంటేనే ఈ రోడ్డుపై ఈ క్షణంలో ఏ ప్రమాదం సంభవిస్తుందోనని వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై చిన్నవి పెద్దవి కలుపుకొని సుమారు 1000 వరకు గుంతలు ఉన్నాయంటే ఈ రోడ్డును పర్యవేక్షిస్తున్న రోడ్లు భవనాల శాఖ వికారాబాద్ అధికారులు ఏం చేస్తున్నారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే రహదారిపై ప్రతినిత్యం మోమిన్ పెట్, మర్పల్లి, బంటారం, పంచలింగాల, తోరమామిడి తదితర గ్రామాలకు పట్టణాలకు వెళ్లే వారంతా ఈ రహదారి గుండా నే వెళ్తుంటారు. వికారాబాద్ రోడ్లు భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News