Bandi Sanjay Kumar : ధరణి పేరుతో గత ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్ల స్కామ్ కు పాల్పడింది
గత బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో 2లక్షల కోట్ల స్కాం జరిగిందని, దేశంలోనే ఇది అతిపెద్ద స్కాం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
దిశ, బడంగ్ పేట్ : గత బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో 2లక్షల కోట్ల స్కాం జరిగిందని, దేశంలోనే ఇది అతిపెద్ద స్కాం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో 24 లక్షల అసైన్డ్ భూములుంటే నేడు ఆ భూములు ఐదు లక్షల భూములు ఉన్నాయని, మిగతా 20 లక్షల భూములు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రం గూడలో బోనాల ఉత్సవాలకు ఆయన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి, మహేశ్వరం ఇంచార్జి అందేలా శ్రీరాములు, కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకు పల్లి వెంకట్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ధరణి పేరుతో బీఆర్ఎస్ లీడర్లు భూములు దోచుకున్నారని ఆరోపించారు. అయితే దీనిపై రేవంత్ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ధరణిని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని, ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు.
ధరణి పేరుతో బీఆర్ఎస్ లీడర్లు భూములు దండుకున్నారని ఆరోపించారు. అయితే దీనిపై రేవంత్ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ధరణిపై ఐదుగురు సభ్యులతో వేసిన కమిటీ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. అలాగే ఫోర్త్ సిటీ, భూమాత పేరుతో భూములను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ధరణి భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫోర్త్ సిటీ' పేరుతో కాంగ్రెస్ నాయకుడి భూ దందా?
కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ' పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూ దందా కొనసాగుతోందని, స్థానిక కాంగ్రెస్ నేత వేయి ఎకరాలను ముందుగానే అగ్గువకు కొని ఈ ప్రాంతంలో పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే భూదందాతో వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు ఫోర్త్ సిటీ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. దీనివల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదన్నారు. మహేశ్వరం కాంగ్రెస్ స్థానిక ఇంచార్జి,కాంగ్రెస్ నాయకుడికే భూములను సేకరించే బాధ్యతను అప్పగించారని ఆరోపించారు. పేరుకు మాత్రమే ఫోర్త్ సిటీ అని, దీని వెనుక పెద్ద భూ దందా నడుస్తుందన్నారు. దీనితో ఇక్కడి ప్రజలకు, యువకులకు ఎలాంటి లాభం చేకూరదన్నారు.
పాతబస్తీ మా అడ్డ అని నిరూపించిన హిందూ సమాజం
ఇది మా అడ్డ... మీ అడ్డ అని కొందరు అంటుంటారు...
హిందువుల దురదృష్టం ఏంటటే తెలంగాణ లో ఏ పాలకులు వచ్చినా... ఎం ఐ ఎం అనే మూర్ఖత్వపు పార్టీకి కొమ్ముగాసే పరిస్థితి ఏర్పడిందన్నారు. వాళ్ళు ఏమైయినా ముస్లిం సమాజం అభివృద్ది గురించి మాట్లాడుతారా? పాత బస్తీ అభివృద్ధి గురించి మాట్లాడుతారా? అంటే మాట్లాడరని కేవలం గోడ మీద పిల్లులు గా ఉంటారన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకుతారన్నారు. ఓవైసీ కుటుంబ సభ్యుల ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగడానికే అన్నారు. ఇంత వరకు ఓల్డ్ సిటీనీ న్యూ సిటీగా చేయాలన్న ఆలోచన కూడా వాళ్లకు రాలేదన్నారు. భాగ్య లక్ష్మి అమ్మవారి గుడి దగ్గర బహిరంగ సభ పెట్టినప్పుడు మమ్మల్ని మతతత్వ వాదులు అని అన్నారని, మత విద్వేశాలు రగిలించడానికే బహిరంగ సభ ఏర్పాటు చేశారని ఆరోపించారన్నారు. మత విద్వేశాలు రాగులాలని కోరుకున్నది బి ఆర్ ఎస్, ఎం ఐ ఎం పార్టీలే నన్నారు. ప్రశాంతంగా సభ నిర్వహించి మా దమ్మేందో నిరూపించామన్నారు. పాతబస్తీ మా అడ్డ అని విర్రవీగే వారికి మీ అడ్డ కాదురా? మా అడ్డ అని ఆ సభలో హిందూ సమాజం నిరూపించిందన్నారు.
జమాతే ఇస్లాం హిందువులను చంపే సంస్థ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రంజాన్ పండుగకు రూ. 33 కోట్ల రూపాయలను ఇచ్చారన్నారు. జమాతే ఇస్లాం అనే ఒక మిలిటెంట్ సంస్థకు రూ. 2.40 కోట్లు ఇచ్చారని, అది హిందువులను చంపే సంస్థ అని, అది ఏ మాత్రం ముస్లిం పేదలకు, ముస్లిం సమాజానికి ఉపయోగపడదన్నారు. ఇంకా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. అదే బోనాల ఉత్సవాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు? వినాయక చవితి, దసరా ఉత్సవాలు, భవాని ఉత్సవాలకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు.
అన్ని వర్గాలను సమానంగా చూడాలి
కేవలం హిందువులనే చూడాలని మేము అనడం లేదని, అన్ని వర్గాలను సమానంగా చూడాలని అంటున్నమన్నారు. ఒక వర్గానికి కొమ్ముకాస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్ముందు బీఆర్ ఎస్ పార్టీకి పట్టిన గతే పడుతుందన్నారు. ఏ రోజయితే మైనార్టీ డిక్లరేషన్ పేరుతో మీరు ఒక వర్గానికి కొమ్ము కాసి, ఆ వర్గం ఓట్ల ద్వారానే అధికారం లోకి వచ్చామని విర్ర వీగుతున్నారన్నారు. ఇక మీకు హిందువులు ఎవరు ఓట్లు వేయరనే ఆలోచన కూడా వచ్చిందన్నారు. ఈ విషయంలో హిందూ సమాజం ఎప్పుడు జాగృతమై ఉందని, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తామని, అప్పుడు మాత్రం 8 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడే 8 ఎంపీ సీట్లు గెలిచామన్నారు.
నేను ధర్మం కోసం పనిచేస్తా... ఎవ్వరికీ భయపడను..
హిందువుల పండుగల పట్ల నిర్లక్ష్యం చేసినా? హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేసినా? హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసినా పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. నేను ధర్మం కోసం పని చేస్తా.... ఎవ్వరికీ భయపడను... అన్ని వర్గాలను సమానంగా చూడాలనుకునే వ్యక్తిత్వం నాది, బీజేపీ కూడా అన్ని వర్గాల గురించి మాట్లాడే పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు.
ఎం ఐ ఎం ను నమ్ముకుంటే కాంగ్రెస్ కు అదే గతి
ఎం ఐ ఎం పార్టీని నమ్ముకుంటే నూటికి నూరు శాతం అవుటవుతారని అన్నారు. 15 నిమిషాల సమయం ఇస్తే నరికి చంపుతా అని అన్నోడు కొడంగల్ లో పోటీ చేస్తాడంట అని ఎద్దేవా చేశారు. అక్కడ హిందువులు ఎమన్నా పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తున్నారా? వాళ్ళు ఏమన్నా ఉరుకుంటారనుకున్నావా? వాళ్ళను చంపుతా అని అన్నావ్ కదా? అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని, వాళ్ళు హిందువులు కాననుకుంటే వాళ్ళ కర్మ అన్నారు.
కలిసి కట్టుగా తెలంగాణ అభివృద్ధికి నిధులు తెస్థాం
ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు తిట్టుడు సంప్రదాయాన్ని పక్కన బెట్టి తెలంగాణ అభివృద్ధికి ఒకరి కొకరు సహకరించుకుందామన్నారు. కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నామని, అభివృద్ధి విషయంలో మేము పూర్తిగా సహకరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నుంచి నిధులు తీసుకువచ్చే బాధ్యత మాదన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు ఇట్లనే ఒర్లి ఒర్లి మోడీని తిట్టినందుకే ఖేల్ ఖతం దుకాణం బందయి, నా ఘర్ కా నా ఘాట్ కా అన్న చందంగా మారిందన్నారు. మీరు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని, గత పార్టీ లాగా వ్యవహరిస్తే మీరే నష్ట పోతారని హెచ్చరించారు. ఇప్పుడయితే మనం కలిసి మోడీ నీ కలుద్దామని, తెలంగాణ అభివృద్ధికి మేము సహకరిస్తామన్నారు. గతంలో బీ ఆర్ ఎస్ పార్టీ ఎం చేసిందో? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుందన్నారు.
30 లక్షల మందిలో ఇప్పటి వరకు 18 లక్షల మందికే రుణమాఫీ
ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య గత ప్రభుత్వ హయాంలోనే 30 లక్షల మంది ఉంటే.. లక్షన్నర లోపు రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 18 లక్షలు దాటకపోవడం విడ్డూరమన్నారు. రుణమాఫీ సహా 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని బీజేపీ పోరుబాటకు సిద్ధ మవుతోందని, ఈ మేరకు కార్యాచరణ రెడీ అవుతోందని బండి స్పష్టం చేశారు.
జీ హెచ్ ఎం సీ లో విలీనానికి బీజేపీ వ్యతిరేకం
అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలను జీ హెచ్ ఎం సీ లో విలీనానికి బీజేపీ వ్యతిరేకం అని బండి సంజయ్ అన్నారు. గతంలో విలీనం చేసిన ప్రాంతాలలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, ఇష్టానుసారంగా పన్నులు పెంచారన్నారు. పేరుకు మాత్రమే జీ హెచ్ ఎం సి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్పా ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. ఇక వ్యవసాయ భూములను కూడా కమర్శియల్ చేస్తారని, పన్నులు, కరెంట్ బిల్లులు విపరీతంగా పెంచుతారని, దీనిని ప్రజలందరూ వ్యతిరేకస్తున్నారని, బీజేపీ కూడా విలీనానికి వ్యతిరేకం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు శ్రీధర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి,శూర కర్ణారెడ్డి,ఇంద్ర సేనా తదితరులు పాల్గొన్నారు.