అప్పుల బాధ తాళలేక దంపతుల ఆత్మహత్య

అప్పుల బాధలు తట్టుకోలేక దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2024-11-24 12:01 GMT

దిశ, తాండూరు : అప్పుల బాధలు తట్టుకోలేక దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం యాలాల మండలం నాగసముందర్ గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్తులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాసుల యాదప్ప(42), భార్య మాసుల జ్యోతి(38) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతురు శ్రీలత(20), కుమారుడు సందీప్(12)లు ఉన్నారు. గత రెండేళ్ల క్రితం కూతురు వివాహం కోసం అప్పులు చేశారు. అలాగే వ్యవసాయం కోసం కొంత అప్పులు చేశారు.

అప్పుల బాధ, ఆర్థిక భారం మోయలేక మనోవేదనకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో వివాహమైన తర్వాత చేసిన అప్పులు ఎక్కువ కావడంతో సంసారంలో గొడవలు మొదలయ్యాయి. శనివారం రాత్రి భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. అదే క్రమంలో ఉదయం కూడా గొడవ జరగడంతో ఇంట్లో ఉన్న పురుగుల డబ్బాతో భార్య మొదటగా తాగగా భర్త కూడా తాగాడు. ఇది గమనించిన స్థానికులు తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు కూతురు శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.


Similar News