పూతపూశారు...మాయచేశారు...
కడియాల(కడ)కు బంగారు పూత పూసి రూ.లక్షల్లో మాయ చేశారు.
దిశ, ఖమ్మం రూరల్ : కడియాల(కడ)కు బంగారు పూత పూసి రూ.లక్షల్లో మాయ చేశారు. ఖమ్మం డీసీసీబీలో గత వారం రోజుల క్రితం ఈ మోసం బయటపడినట్లు తెలిసింది. కానీ అది ఆలస్యంగా వెలుగు చూసింది. గత రెండు రోజుల క్రితం ఖమ్మం డీసీసీబీ వారు సిబ్బందిని పిలిపించి చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో అధికారులు నిందితుల అడ్రస్‌కు వెళ్లగా అక్కడ వారు లేనట్టు తెలింది. హైద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఖమ్మంలోని తన బావమరిదితో మాయకు పన్నాగం పన్నారు. నిందితులు ఖమ్మంనగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో కూడా కడియాన్ని తాకట్టుపెట్టగా అప్రైజర్ దానిని కట్ చేయడంతో అది నకిలీది అని తెలింది.
దీంతో విషయం బయటకు వచ్చింది. ఈ ముఠా ఖమ్మం పంజాబ్ బ్యాంక్‌ను సైతం మాయ చేసి లోన్ తీసుకున్నారు. దీంతో అప్రమత్తమైన డీసీసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఖమ్మం నగరంలోని నాలుగు డీసీసీబీ శాఖల్లో ఈ ముఠా రుణాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. హైద్రాబాద్‌కు చెందిన ముఠా నాయకుడు ఖమ్మం రూరల్ మండలం డాక్యాతండా, తాళ్లేసతండాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో ఈ మోసానికి పథకం రచించి అమలు చేశారు. ఖమ్మం నగరంలోని ఒక్క డీసీసీబీ బ్యాంక్‌లోనే ఈ ముఠా 29 మంది పేర్ల మీద దాదాపు రూ.30 లక్షలకు పైగా రుణాలను తీసుకున్నట్టు తెలిసింది.
బంగారం నకిలీ ఇలా..
ఈ ముఠా కేవలం కడియాలను మాత్రమే తాకట్టు పెడుతుంది. హైద్రాబాద్‌కు చెందిన ముఠా నాయకుడు సుమారు 30 గ్రాముల కడియాన్ని తయారు చేసి దానిపై మూడు లేదా నాలుగు గ్రామాల బంగారు పూత పూస్తాడు. దీంతో అప్రైజర్ సైతం కనుక్కునే వీలు లేకుండా ప్లాన్ చేయడంతో వారి పని సులువుగా మారుతుంది. ఇప్పటి వరకు డీసీసీబీ అధికారులకు అందిన సమాచారం ప్రకారం ఈ ముఠాలో మామిళ్లగూడెం, పోలే పల్లి రాజీవ్ గృహకల్ప, కరుణగిరి, పాత ఎస్సీ ఆఫీసురోడ్లు, లెనిన్‌నగర్, ఏదులాపురం, చిన్న తండా, తీర్థాల సమీపంలోని డాక్యాతండాకు చెందిన వారు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. పదేళ్ల కిందట డీసీసీబీలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఓ అప్రైజర్ తన అనుచరుల పేరుతో బురిడీ కొట్టించారు. కాగా సోమవారం పోలీసు స్టేషన్లలో డీసీసీబీ అధికారులు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
ఇతర బ్యాంకుల్లో సైతం భారీ మోసం
ఈ ముఠా ఒక్క డీసీసీబీ బ్యాంకులోనే కాకుండా ఇతర బ్యాంక్‌ల్లో సైతం భారీగా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాలో ఇద్దరు మహిళలు సైతం కీలకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ ముఠా సభ్యులు ఇండ్లు, కార్లు కొనుగోలు చేసి జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. బ్యాంక్ అధికారులు, పోలీసులు అప్రమత్తమై విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.