వీడిన జంట హత్యల కేసు మిస్టరీ
ఏలూరు జిల్లా మండవల్లి మండలం డి.గన్నవరంలో శనివారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఒక్క రోజులో ఛేదించారు.
దిశ ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా మండవల్లి మండలం డి.గన్నవరంలో శనివారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఒక్క రోజులో ఛేదించారు. నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ ఈ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. మండవల్లి మండలం డి గన్నవరంలో తల్లి రొయ్యూరు భ్రమరాంబ, కుమారుడు సురేష్‌లు శనివారం వేకువ జామున హత్యకు గురయ్యారు. ఈ విషయం తెలియగానే ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, కైకలూరు రూరల్ సర్కిల్ ఇనస్పెక్టర్ వి రవి కుమార్, మండవల్లి ఎస్‌ఐ రామచంద్ర రావు ఆ గ్రామం వెళ్ళి హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం జంట హత్యలుగా కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ శివకిశోర్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులను పట్టుకునేందుకు బృందాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్‌పి మాట్లాడుతూ.. హతుడు సురేష్ భార్య గాయత్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించామన్నారు.
గన్నవరానికి చెందిన రొయ్యూరు సుబ్బారావుకు ఇద్దరు భార్యలని, మొదటి భార్య నాంచారమ్మ, ఆమె కుమారుడు నగేష్ బాబు వున్నారు. రెండో భార్య, నాంచారమ్మ చెల్లెలు అయిన భ్రమరాంబకు సురేష్ కుమారుడని డీఎస్‌పి వివరించారు. ఉభయ కుటుంబాల మధ్య తాత ఆర్జించిన ఉమ్మడి ఆస్తి విషయమై గొడవలు జరిగాయి. ఫిర్యాది భర్త సురేష్, అత్త భ్రమరాంబ తోను రొయ్యూరు నగేష్ బాబు ఆస్తి మొత్తం తనకే ఇచ్చేయాలని గొడవ పడుతూ ఇవ్వకపోతే ఎప్పటికైన నరికి చంపి ఆస్థిని చేజికించుకుంటానని తిరుగుతూ ఉండేవాడని ఆయన వివరించారు. నవబంర్ 1వ తేదీ సాయంత్రం ఫిర్యాదు తండ్రి సంవత్సరీకం కోసం పిల్లలను తీసుకుని పుట్టింటికి ముసునూరు వెళ్ళింది. ఇంటి వద్ద ఆమె భర్త, అత్త మాత్రమే ఉన్నారు. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి సుమారు 02.00 గంటలకు సురేష్ , భ్రమరాంబ ఇంట్లో నిద్రిస్తూ ఉండగా నిందితుడు రొయ్యూరు నగేష్ బాబు కక్ష కట్టి వారిని దారుణంగా కత్తితో నరికి చంపాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 48 గంటలలో కైకలూరు రూరల్ సీఐ, మండవల్లి మండవల్లి ఎస్‌ఐ నిందితుడిని అరెస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలో ఈ కేసును చేధించిన కైకలూరు రూరల్ సిఐని , మండవల్లి ఎస్సై ని కానిస్టేబుల్ నాగార్జున, నాగ ఆంజనేయులు, నాగబాబులను ఏలూరు డీఎస్పీ ప్రశంస పత్రాలు నగదు బహుమతి అందించి అభినందించారు.