దిశ, యాచారంః ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి యాచారంలోని ఆర్టీసీ బస్టాండ్ బురదమయంగా మారి చెరువును తలపిస్తోంది. బస్సు ఎక్కాలన్నా దిగాలన్నా.. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ను రీ ఓపెనింగ్ చేసి సంవత్సరం గడుస్తున్నా సరైన వసతులు కల్పించకపోవడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. శనివారం తెల్లవారుజామున నుండి కురిసిన వర్షాలకు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పడిన పెద్ద గుంతల్లో వర్షపు నీరు చేరి బురదమయం అయింది. ప్రయాణికులు బస్టాండ్ ఆవరణలో నడిచే సమయంలో బస్సులు వస్తే బురద నీరు ప్రయాణికుల మీద పడుతోంది. ప్రాంగణం చిత్తడి చిత్తడిగా మారుతోంది. ప్రయాణికులు అడుగు తీసి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. వృద్ధులు, పిల్లలైతే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో తాత్కాలిక మరమ్మత్తులు కాకుండా సీసీ రోడ్డును నిర్మించాలని పలువురు కోరుతున్నారు.