ఇరిగేషన్‌శాఖలో ఎన్‌ఓసీల దందా!
పర్యావరణం పరిరక్షించాలి.. కాల్వాలు, కుంటలు, చెరువులను ధ్వంసం చేయకుండా కాపాడాల్సిన... Special Story
దిశ, రంగారెడ్డి బ్యూరో, శంషాబాద్: పర్యావరణం పరిరక్షించాలి.. కాల్వాలు, కుంటలు, చెరువులను ధ్వంసం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ప్రజాప్రతినిధులు, అధికారులు వివిధ వేదికలపై ప్రసంగాలు చేస్తారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారంటే రాజకీయ స్వాలాభం కోసమని చెప్పుకోవచ్చు. కానీ అధికారులు మాట్లాడే ముందు వాళ్లు విధులను ఏవిధంగా నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు కచ్చితంగా వస్తాయి. ఆ ప్రశ్నలకు వారి వద్ద సమాధానం ఉండదు. కాకపోతే ఇతరులపై నెపం నెట్టి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల పనితీరు ఇలాగే ఉందని చెప్పకతప్పదు. ఎందుకంటే ఇష్టానుసారంగా ఇరిగేషన్అధికారులు ఎన్‌వోసీలు ఇవ్వడం అందుకు అనుగుణంగా పనిచేస్తున్నామని రెవెన్యూ అధికారులు చెప్పడం ఆలవాటుగా మారింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్మండలం మల్కారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు ఎం–1 75, ఎం–2 34, 65, 66,77, 78,79 లల్లో ఓ రియల్‌వ్యాపారి సుమారు 50 ఎకరాలల్లో ఫాం ల్యాండ్చేస్తున్నారు. అయితే ఈ రెవెన్యూ సర్వే పరిధిలోని భూమి 111 జీవో పరిధిలో ఉంటుంది. అంతేకాకుండా ఇదే సర్వే నెంబర్లల్లో ఈసీ వాగు పరివాహాక ప్రాంతం ఉందని స్థానికులు, అక్కడున్న తూములే సమాధానం చెబుతున్నాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా రియల్‌వ్యాపారులు అధికార, ధన బలం ఉపయోగించి ఇష్టానుసారంగా వాగులను ధ్వంసం చేసి వెంచర్లు వేస్తున్నారు. ఇదే భూమిలో వాగును పూడ్చివేసేందుకు మట్టిని తరలిస్తుంటే గమనించిన ‘దిశ’ ప్రతినిధి కథనం రాస్తే రెవెన్యూ, ఇరిగేషన్అధికారులు స్పందించి పనులు నిలిపివేశారు. ఆ తర్వాత ఇరిగేషన్అధికారులను మ్యానేజ్‌చేసి తెచ్చుకున్న ఎన్వోసీతో రియల్‌వ్యాపారులు వాగును మట్టితో నింపి వేస్తున్నారు. అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం వాగులు, వంకలు, కాల్వాలను ఎన్‌వోసీల పేరుతో మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అధికారులకు ఇదీ కనిపించడం లేదా...?
శంషాబాద్మండలంలో నూటికి 90 శాతం రెవెన్యూ 111 జీవో పరిధిలోనే ఉంది. ఈ జీవో అమలులో ఉన్నప్పుడు చదునుతోపాటు నిర్మాణాలు, మట్టి తవ్వకాలు, పోయడం వంటివి చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి. కానీ అధికారులు మాముళ్ల మత్తులో ఊగిపోయి అవేమి తమకు తెలియనట్టుగా వ్యవహారించడంతో రియల్‌వ్యాపారులు ఇష్టానుసారంగా వాగులు, వంకలను కూల్చివేస్తున్నారు.
ఇదీ నిజమేనా....?
రియల్‌వ్యాపారులు ఎన్‌వోసీ కోసం ఫైరవీలు చేసి ఎట్టకేలకు ఓ పత్రాన్ని తీసుకున్నారు. అయితే 26 ఎకరాల 36 గుంటల భూమి వివిధ సర్వే నెంబర్లలో కొనుగోలు చేశారు. ఈ భూమి బఫర్ జోన్లో ఉందా లేదా అనే విషయాన్ని ఇరిగేషన్అధికారులు నిర్ధారిస్తారు. కానీ నిర్ధారించే అధికారులు ఈ వ్యాపారి భూమి బఫర్‌జోన్‌లో లేదని ఇవ్వడం కరెక్టే. కానీ ఆ సర్వే నెంబర్లల్లో ఎక్కడి వరకు బఫర్ జోన్ఉందో హద్దులు పెట్టారా ఆ తర్వాతే ఎన్‌వోసీ జారీ చేయాల్సి ఉండే. అప్పుడు ఎంతవరకు ఈసీ వాగు బఫర్జోన్కిందకు వర్తిస్తుందో తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్మండలం మల్కారం రెవెన్యూ పరిధిలోని ఎం–1 75, ఎం–2 34, 65, 66,77, 78,79 నెంబర్లల్లో మొత్తం 71 ఎకరాల 22 గుంటల భూమి ఉందని చెప్పడం సరిపోదు.. అందులో ఏ సర్వే నెంబర్ సబ్డిజవిన్లో బఫర్ జోన్ఉంది. ఆ బఫర్ జోన్చుట్టూ హద్దులు పెట్టుకునే అవకాశం ఇరిగేషన్అధికారులకు ఉంది. కానీ ఇవేమీ పాటించకుండా తమకు నచ్చిన పద్దతిలో ఎన్‌వోసీలు జారీ చేయడం అటు రెవెన్యూ అధికారులు ఆ సర్టిఫికెట్‌ల సాకుతో పట్టించుకోకపోవడం జిల్లాలో ఆనవాయితీగా నడుస్తుంది.
ప్రజాప్రతినిధులకే బెదిరింపులు...
ఈసీ పరివాహాక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా రియల్‌వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారు. బఫర్‌జోన్, 111 జీవోలను తుంగలోకి తొక్కి వాగుల్లో మట్టిని పోస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకుంటే అధికారులే ఎన్‌ఓసీ ఇచ్చారు. మీరు ఎవరు అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అంతేకాకుండా మల్కారం, సుల్తాన్‌పల్లి సర్పంచులను సైతం బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా రియల్‌వ్యాపారులు వెంచర్లు చేసి సామాన్యలను మోసాలకు గురిచేసి అధిక రాబడి పొందేందుకు అక్రమార్గాన్ని ఎంచుకుంటున్నారు.