నాడు శ్మశాన వాటికలకు పెద్దపీట.. నేడు విద్య హబ్ కు ప్రాధాన్యత
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ భూములలో శ్మశాన వాటికలకు, కబ్బరికిస్తాన్లకు కేటాయించింది.
దిశ, తలకొండపల్లి : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ భూములలో శ్మశాన వాటికలకు, కబ్బరికిస్తాన్లకు కేటాయించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ పంచాయతీకి చెందిన శివారు ప్రాంతంలోని సర్వేనెంబర్ 156 లో40.22 గుంటల ప్రభుత్వ భూమిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఎంపిక చేసింది. దీంతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు డోకూర్ ప్రభాకర్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ 1200 మంది బలిదానాల వల్ల తెలంగాణ సాధించుకుంటే అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కేవలం వారి కుటుంబం, వారి పదవుల పై ఉన్న ప్రేమ పేద ప్రజల పై కనబడతలేదని అన్నారు. ఏనాడు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వకుండా ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఒంటెద్దు పోకడల వల్లే ప్రజలు తీసి నేలకు కొట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లోని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే పాటుపడిందని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం పల్లెల్లో ఇందిరమ్మ కట్టించిన ఇండ్లు ఆనాడు ఇచ్చిన భూములే నేడు అందరి కండ్లకు కనిపిస్తున్నాయని, ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఎక్కడ ఇవ్వకుండా 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం మాటల మాంత్రికుడిగా గారడి చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు అధినేతగా వ్యవహరించిన కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం మహత్తరమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
ఈ నిర్ణయంతో ప్రజలకు తన పేరును చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రభాకర్ రెడ్డి, రఘురాములు, మోహన్ రెడ్డి లు ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను కూడా రానున్న రోజుల్లో అన్ని అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మన్నలను పొందడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 190 జీవో విడుదల చేస్తూ అధునాతనమైన, అన్ని హంగులతో రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు తలకొండపల్లి మండలానికి పెద్ద పీట వేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. మండల ప్రజలందరూ కసిరెడ్డి నారాయణరెడ్డి చేసిన మేలును జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ యాదవ్, అజీమ్, డిగ్రీ కృష్ణ, చెన్నకేశవులు, ఎండి ఆరిఫ్, డేవిడ్, రేణు రెడ్డి, రాములు, నరసింహ, దీప్తి, శ్రీశైలం, రమేష్, చిన్న హరి మోహన్ రెడ్డి, కాకి కృష్ణ, రమేష్ యాదవ్, వెంకటయ్య, శంకర్, మచ్చందర్, అనిల్, ప్రదీప్ రెడ్డి, శ్రీకాంత్, శివ, వెంకటేష్, పవన్ వాల్మీకి తదితరులు పాల్గొన్నారు.