డయల్ కాల్ హిస్టరీని శోధిస్తే.. 3 హత్య కేసుల మిస్టరీ
మద్యం సేవించిన తరువాత మహిళలపై లైంగిక దాడికి పాల్పడే
దిశ, సిటీ క్రైమ్ : మద్యం సేవించిన తరువాత మహిళలపై లైంగిక దాడికి పాల్పడే అలవాటుతో ఓ బ్యాండ్ గ్రూపులో డోల్ కొట్టే వ్యక్తి మూడు హత్యలు చేశారు. ఒకటి డబుల్ మర్డర్, మరొకటి ఓ మహిళను చంపేశాడు. కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ గ్రామంలోని ఓ ఫాంహౌజ్ లో ఈ నెల 16న జరిగిన డబుల్ మర్డర్ కేసు దర్యాప్తులో ఈ ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం ఎల్బీనగర్ లోని రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ తో కలిసి వివరాలను వెల్లడించారు. కందుకూరు మండలం దాసర్ల పల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివ కుమార్ బ్యాండ్ గ్రూపులో డోలు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి మద్యం సేవించిన తర్వాత మహిళలపై లైంగిక దాడికి పాల్పడే అలవాటు ఉంది.
ఆ సమయంలో ఎవరైనా ప్రతిఘటిస్తే చంపేస్తాడు. ఇలా మందుకూరు మండలం లో ఉండే ఫాంహౌస్ లు, తోటలో పని చేసే మహిళలు, కూలీలను టార్గెట్ చేస్తాడు. దీని కోసం అక్కడికి వెళ్లి వారిని పరిచయం చేసుకుంటాడు. ఈ విధంగానే కొత్త గూడ గ్రామంలోని చింతపల్లి మనోహర్ రావు ఫాంహౌస్ లో పనిచేస్తున్న ఉషయ్య(70), శాంతమ్మల(65) లను పరిచయం చేసుకున్నాడు. తరచు అక్కడికి వస్తుండటంతో ఈ దంపతులు స్థానికుడని మాట్లాడుతుండేవారు. అయితే ఈ నెల 16వ తేదీ ఉషయ్య ఊరికి వెళ్తున్నాడని, శాంతమ్మ ఒకతే ఉంటుందని తెలుసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు మద్యం సేవించి ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టేసి దాసర్ల పల్లి గ్రామం నుంచి కొత్తగూడ ఫాంహౌస్ కు రాత్రి 8 గంటల తర్వాత వచ్చాడు. అక్కడ శాంతమ్మ ఉన్న గదికి వెళ్ళి ఆమె పై లైంగిక దాడికి యత్నిం చాడానికి ప్రయత్నం చేశాడు.
శాంతమ్మ ప్రతిఘటించడంతో ఆమెను చంపేశాడు. ఆ తర్వాత పొలంలోకి వెళ్తుండగా ఉషయ్య కనపడ్డాడు. ఎక్కడికి పోతున్నావని ఉషయ్య అడుగగా బోరు దగ్గరకు పోతున్నాని చెప్పి శివకుమార్ కొద్ది దూరం వెళ్ళి వెనక్కి వచ్చి ఉషయ్యను చంపేశాడు. అప్పటికే శాంతమ్మను చంపి తప్పించుకుని పోదామనుకుని ఉన్న సమయంలో ఉషయ్య అతనిని చూడడం తో తాను పోలీసులకు దొరికిపోతానని భయాందోళనలో డబుల్ మర్డర్ కి తెగబడ్డాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఫాంహౌస్ యజమాని పంపిన మహేందర్ ఈ ఘటనను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసి ప్రాధమికంగా సేకరించిన ఆధారాలతో శివకుమార్ ను శుక్రవారం అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్ కు తరలించారు. ఫోన్ పోయిందనుకుని మృతుడి ఫోన్ నుంచి డయల్ చేశాడు.
ఎలాంటి క్లూ లేని ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్య 8.27 నిమిషాలకు జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్నారు. ఆ సమయంలో ఫాంహౌస్ కు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారనే కోణంలో దర్యాప్తు ను ప్రారంభించారు. ఇలా పలు బృందాలు రంగంలోకి దిగి పలు కోణాల్లోను జల్లెడ పట్టారు. ఐటీ విభాగం ఏసీపీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉషయ్య ఫోన్ ను పరిశీలించారు. అయితే అందులో సంఘటన జరిగిన రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఫోన్ కాల్స్ హిస్టరీని విశ్లేషించారు. అందులో ఓ నెంబర్ డయల్ హిస్టరీలో కొంత అనుమానాస్పదంగా , అసలు ఎలాంటి సంబంధం లేకుండా డయల్డ్ హిస్టరీలో ఆ నెంబర్ ఎందుకు ఉందని ఆరా తీసి, సంఘటన జరిగిన తర్వాత డయల్డ్ హిస్టరీ లో ఉన్న నెంబర్ నుంచి ఎవరికి ఫోన్ వెళ్ళిందని తెలుసుకున్నారు. రాత్రి 10 తర్వాత వైన్ షాప్ కు ఫోన్ చేసి మద్యం కావాలని అడిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వైన్స్ లో పని చేసే వ్యక్తి ద్వారా శివకుమార్ ను గుర్తించారు. అతని అదుపులోకి తీసుకుని విచారించగా డబుల్ మర్డర్ చేసింది తానేనని అంగీకరించాడు.
హత్య చేసి ఏడాదిగా అక్కడే సంచారం.. అయినా పోలీసులకు చిక్కలేదు
ఈ డబుల్ మర్డర్ హత్య మిస్టరీ వీడగానే పోలీసులు మరింత లోతుగా విచారించగా తాను 2023 మార్చి 23న తాను నివసించే గ్రామానికి చెంది శైలజ రెడ్డి మహిళను హత్య చేశానని చెప్పాడు. ఆమెను కూడా మద్యం సేవించిన తర్వాత లైంగిక దాడికి యత్నించినప్పుడు ఆమె ప్రతిఘటించినప్పుడు చంపేశానని చెప్పాడు. ఆ హత్య కూడా రాత్రి 8 గంటల సమయంలోనే చేశాడని శివకుమార్ పోలీసులకు వివరించాడు. పోలీసులు ఈ హత్య కేసును కొద్ది రోజుల పాటు దర్యాప్తు చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోవడంతో నిందితుడు శివకుమార్ అందరి ముందే తిరుగుతూ ఇప్పుడు డబుల్ మర్డర్ చేశాడు. శైలజ రెడ్డి హత్య కేసును పోలీసులు శాస్త్రీయ కోణంలో పోకుండా కేవలం సాంకేతికత పై ఆధార పడి సరైన ఆధారాలు దొరకకపోవడంతో దర్యాప్తు ను అటకెక్కించారు. అప్పుడే దర్యాప్తును కొనసాగించి ఉంటే ఈ వృద్ధ దంపతులు హత్యకు గురికాకపోయిండే వారని స్పష్టమవుతుంది. శివ కుమార్ చెప్పిన ఆధారాలతో అప్పడు పోలీసులు హత్యకు ఉపయోగించిన గొడ్డలి , ఇతర వస్తువుల పై పడ్డ వేలిముద్రలను భద్రపర్చడంతో వాటిని తాజాగా శివకుమార్ వేలు ముద్రలను తీసి పరిశీలించడంతో అవి పోలి ఉన్నాయని నిర్ధారణైంది. ఈ హత్య ల మిస్టరీని చేధించిన పోలీసు అధికారులను సీపీ సుధీర్ బాబు అభినందించి , రివార్డులను అందిస్తామన్నారు.