పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష
మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి, లైంగిక దాడికి యత్నించిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధించారు.
దిశ, బడంగ్ పేట్ : మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి, లైంగిక దాడికి యత్నించిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధించారు. బాలాపూర్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... బాలాపూర్ ఉస్మాన్ నగర్ కు చెందిన మొహమ్మద్ జియాన్ అలియాస్ మొహమ్మద్ ఓమర్ (23)కు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మైనర్ బాలికపై కన్నుపడింది. ఈ నేపధ్యంలోనే 2020 లో ప్రేమ పేరుతో సదరు మైనర్ బాలిక వెంట పడ్డాడు. ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో బాలాపూర్ పోలీసులు నిందితుడిపై ఫొక్సోచట్టంపై కేసులు నమోదు చేశారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి జియాన్ ను దోషిగా నిర్దారించి, రూ.5వేల జరిమానాతో పాటు మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత వాదనలు వినిపించారు. అంతేగాకుండా బాధితురాలికి రూ. లక్ష రూపాయల నష్టపరిహారాన్ని అందజేశారు.