సెట్ బ్యాక్ లేదు పార్కింగ్ ఉండదు...
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో బిల్డింగ్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
దిశ ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలో బిల్డింగ్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో సెట్ బ్యాక్ వదలకుండా ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా మార్కెట్ ఉండే ప్రధాన రోడ్లలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు రోడ్లు కబ్జా చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. మార్కెట్ కు వచ్చే వారు రోడ్లపైన అక్రమంగా పార్కింగ్ చేస్తున్న పట్టించుకునే నాథులే కరువయ్యారు. దీంతో నిత్యం ట్రాఫిక్ జామ్ తో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ పట్టణంలో రోడ్లు కబ్జా చేయడం సర్వసాధారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం నిద్రమత్తులో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముడుపులు, జీతాలు తీసుకోవడమే డ్యూటీ..!
వికారాబాద్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల నుంచి మున్సిపల్ కమిషనర్ ఎవరూ కూడా తమ విధులు సక్రమంగా నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఎవరి స్థాయికి తగ్గట్లు వారు అక్రమార్కుల దగ్గర లంచాలు తీసుకుంటూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో పట్టణంలో అక్రమ నిర్మాణాల పై అనేక వార్తలు ప్రచురితం అయినప్పటికీ ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా పూర్తి ఆధారాలతో వార్త పత్రికల్లో వార్తలు ప్రచురించి నా స్పందించని మున్సిపల్ అధికారులు, కేవలం ఎవరైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేస్తేనే స్పందిస్తామంటూ సమాధానం ఇస్తున్న పరిస్థితి. ముడుపులు, జీతాలు తీసుకోవడమే వారి రోజువారీ డ్యూటీగా మారిందనే ఆరోపణలున్నాయి.
బాలాజీ స్వీట్ హౌస్ యజమాని రోడ్డు కబ్జా..
వికారాబాద్ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ రోడ్డులో ఉన్న బాలాజీ తారాచంద్ స్వీట్ హౌస్ యజమాని ఇష్టానుసారంగా రోడ్డు కబ్జా చేస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో సెట్ బ్యాక్ వదలకుండా ఆలంపల్లి ప్రధాన రోడ్డుపైపు రోడ్డు కబ్జా చేసి ఏకంగా లిఫ్ట్ ఏర్పాటు చేశాడు. దీని పై దిశ దినపత్రికతో పాటు అనేక పత్రికల్లో వార్తలు ప్రచురితమైన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో మరింత రెచ్చిపోయిన సదరు యజమాని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వైపు వెళ్లే రోడ్డును కూడా కబ్జా చేసి పానీపూరి బండి ఏర్పాటు చేశాడు. దీంతో స్వీట్ హౌస్ రెండు వైపులా పార్కింగ్ స్థలం లేకుండా పోయింది. ఈ కారణంగా ఆ రోడ్డులో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఇంకాస్త ముందుకు వెళితే సిండికేట్ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకు ఉన్న బిల్డింగ్ ఓనర్ కూడా సెట్ బ్యాక్ సరిగా వదలకుండా బిల్డింగ్ నిర్మాణం చేపట్టడంతో బ్యాంకుకు వచ్చే కస్టమర్లు రోడ్డు మీదే బైకుల పార్కింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అలా రోడ్డు మొత్తం సెట్ బ్యాక్ అనేది లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో ఈ రోడ్డులో అనునిత్యం ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఇప్పటికైనా కలెక్టర్, అదనపు కలెక్టర్లు స్పం దించి వికారాబాద్ మున్సిపల్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారుల పై చర్యలు తీసుకొని, రోడ్డుపైన ఫుట్ పాత్, ఇతర అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని వాహనదారులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.