33 ఎకరాల చెరువు కనుమరుగు!
పాతికేళ్ల క్రితం పరిగిలో కొత్త చెరువు అంటే గణేషుడి నిమజ్జనం, బతుకమ్మల నిమజ్జనం చేసేవారు. సమీప ఆయకట్టు రైతుల పొలాలకు నీరిందేది.
దిశ, పరిగి: పాతికేళ్ల క్రితం పరిగిలో కొత్త చెరువు అంటే గణేషుడి నిమజ్జనం, బతుకమ్మల నిమజ్జనం చేసేవారు. సమీప ఆయకట్టు రైతుల పొలాలకు నీరిందేది. రైతులు ఆ చెరువు కట్టపై ఉన్న దేవుడికి ప్రత్యేక పూజలు చేసి పండిన పంటలను నైవేద్యంగా పెట్టేవారు. కట్టకు కొంత దూరం బఫర్ జోన్‌లో అనాథ శవాలకు దహన సంస్కారాలు చేసేవారు. చెరువు కట్టకు కొంత దూరంలోనే హైదరాబాద్ – బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణం జరగడంతో రియల్టర్ల కన్ను కొత్త చెరువు పై పడింది.
మూడు సర్వే నంబర్లు.. 33 ఎకరాలకు పైగా విస్తీర్ణం..
254, 256, 257 సర్వే నెంబర్ లలో కొత్త చెరువు ఉండేది. 254 సర్వే నెంబర్‌లో 13.27 ఎకరాలు, 256 సర్వే నెంబర్ లో 2.12 ఎకరాలు, 257 లో 17.19 ఎకరాల భూమి ఉన్నట్లు ఆనాటి పహాణి, నేటి ధరణి పోర్టల్‌లో మూడు సర్వే నంబర్లలో కలిపి 33.18 ఎకరాల భూమి ఉన్నట్లు చూపిస్తున్నది. కాగా చెరువును మొత్తం మూడు సర్వే నంబర్లలో 33.18 నిర్మించారని, మరి కొందరు కొంత మిగులు భూమిని వదిలేసి 28.18 ఎకరాల్లో చెరువును నిర్మించారంటూ చెబుతున్నారు.
గండి కొట్టించి.. శిఖంపై కన్ను
పరిగి గ్రామ పంచాయతీ నుంచి మేజర్ గ్రామ పంచాయతీగా దినదినాభివృద్ధి చెందుతున్న సమయంలో చెరువు శిఖంపై రియల్టర్ల కన్ను పడింది. భారీ వర్షాల కారణంగా చెరువు కట్టకు చిన్నపాటి గండి పడిందని, గండి పూడ్చకుండా, దానిని పెద్దది చేసి కట్ట కంటే కిందకు మరో కట్ట కట్టించినట్లు చెబుతున్నారు. దీంతో ఏటా వర్షా కాలంలో వర్షాలు కురవడం, వరద ఉధృతితో చెరువులో పూడిక పెరగడంతో రియల్టర్ల పని మరింత సులభంగా మారింది."
ప్లాట్లు చేయడం.. అనుమతులు ఇవ్వడం
శిఖంలో ప్లాట్లు చేసి విక్రయాలు ప్రారంభించారు. చెరువు శిఖం అని తెలిసినా అప్పట్లో ఎవరి పర్సెంటేజీలు వారు తీసుకొని చెరువును చెరబట్టేశారు. వేల సంఖ్యలో ప్లాట్లు చేసి చెరువును కుంటగా మార్చారు. ఈ చెరువుకు సంబంధించిన ఎలాంటి రికార్డులు, ఆయకట్ట సాగు వివరాలు లేకుండా రియల్టర్లు అధికారులకు అమ్యామ్యాలు ఇచ్చి గల్లంతు చేసినట్లు ఆరోపిస్తున్నారు. గతంలో చెరువుల నిర్వహణ మొత్తం పంచాయతీ రాజ్ శాఖ కిందే ఉండేదని 2015 నుంచి ఇరిగేషన్ శాఖకు అప్పగించినా ఎలాంటి రికార్డులు ఇవ్వలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
33 నుంచి 3 ఎకరాలకు..
గూగుల్ మ్యాప్‌తో ఫో షీట్ వంటి ఆధారాలు లేకుంటే చెరువా.. చెరువెక్కడిదే అనే రియల్టర్లు కూడా లేకపోలేరు. కొత్త చెరువు సర్వే నెంబర్ల ప్రకారం 33.18 ఎకరాల నిర్మితమైన లే–అవుట్లు చేసి 28.18 ఎకరాలకు కుదించారు. కట్టకు గండి కొట్టించి చెరువును, కుంటగా మార్చి ప్రస్తుతం ఇరిగేషన్ అధికారుల తోఫోషీట్‌లో కొత్త కుంట కేవలం 3 ఎకరాల్లో ఉందనే స్థాయిని చెరువును మింగేశారు రియల్టర్లు.
తాజాగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అనుమతులు
కొత్త చెరువు శిఖంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో తాజాగా అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. చెరువు కట్ట అని, బఫర్ జోన్ అని, ఎఫ్‌టీఎల్‌లో ఉందని తెలిసినా అధికారులు అనుమతులు ఇచ్చేశారంటూ మండిపడుతున్నారు. చెరువు నుంచి నీరు వెళ్లే తామూ పక్కనే ఓ ఇంటి నిర్మాణం చేపట్టడం అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంపై అనుమానాలకు దారి తీస్తుంది. హైడ్రా వస్తే గాని పరిగిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలపై అధికారులు నోరు మెదపరేమోనంటూ అనుకుంటున్నారు. శిఖం, బఫర్ జోన్లలో ఇండ్లు నిర్మించుకున్న వారికి లోలోపల భయం మొదలైనా పైకి మాత్రం తమదేం తప్పు అన్నట్లు ప్లాట్లు విక్రయించారు.