fireworks : బాణాసంచాను.. ఆదమరిస్తే అంతే...
వయస్సుతో సంబంధం లేకుండా, చిన్న పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి.
దిశ, బొంరాస్ పేట్ : వయస్సుతో సంబంధం లేకుండా, చిన్న పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. పండుగ రోజున కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా కాలుస్తూ ఆనందంగా గడుపుతారు. ప్రతి ఒక్కరు తమ ఇంట్లో చీకటిని పారద్రోలి దివ్వెల వెలుగులు (కాంతులు), వెలగాలని కోరుకుంటూ ఇంటి వాకిట్లో మట్టి ప్రమిదలు వెలిగిస్తారు. పెద్ద శబ్దాలు వచ్చే బాంబు ఇంటి ముందు పేలుస్తుంటే, మహిళలు, చిన్నపిల్లలు రంగురంగుల వెలుతురు వెదజల్లే సురసురాలు, భూచక్రాలు కాలుస్తూ, ఇంటిల్లిపాది సంతోషంగా ఆనందంగా గడుపుతారు. బాణాసంచా కాల్చే సమయంలో, ఏ మాత్రం ఏమరపాటుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రమాదాల బారిన పడే ముప్పు ఉంది. టపాకాయలు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్దపెద్ద టపాకాయల శబ్దాలకు చిన్న పిల్లలకు వినికిడి లోపించే ప్రమాదం ఉంది.
టపాకాయలు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
* కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి.
* శరీరానికి బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు.
* టపాకాయలు కాల్చేటప్పుడు, మూతికి గుడ్డ పెట్టుకోవాలి.
* కండ్లకు అద్దాలు పెట్టుకోవడం మంచిది.
* టపాకాయలు కాల్చేటప్పుడు నీరు, ఇసుక దగ్గరగా ఉంచుకోవాలి.
* చిన్నపిల్లలు కాల్చేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా ఉండాలి.
* పూరి గుడిసెల మధ్య టపాసులను పేల్చడం మంచిది కాదు.
* సగం పేలిన టపాకాయల వద్దకు పిల్లలను పంపించకూడదు, కొంత సమయం గడిచాక వాటిని నీటిలో వెయ్యాలి.
* చేతులతో పట్టుకొని, టపాసులు కాల్చరాదు. అలా చేస్తే చేతుల్లోనే అవి పేలే ప్రమాదం ఉంది. దీనివల్ల చేతులు, శరీరం కాలే అవకాశముంది. కాబట్టి చేతుల్లో టపకాయలు కాల్చకూడదు అని పిల్లలకు సూచించాలి.
* తారాజువ్వలను నిలువుగా ఉంచి మాత్రమే కాల్చాలి.
* సగం కాలిన టపకాయలను చిన్నపిల్లలు వాటి దగ్గరికి వెళ్లి ఊదడం వంటివి చేస్తారు. అలాంటప్పుడు పెద్దవారు వారిని అక్కడికి వెళ్లకుండా చూసుకోవాలి.
* గడ్డివాములు, కట్టే కుప్పలు, పెట్రోల్ బంకుల, సిలిండర్, నూనె డబ్బాలు దగ్గర టపాసులు కాల్చరాదు. ఎందుకంటే, నిప్పురవ్వలు పడి అవి కూడా కాలే అవకాశం ఉంది కాబట్టి.
* కిటికీలు, తలుపులు మూస్తే చాలా మంచిది. ఎందుకంటే నిప్పురవ్వలు ఇంట్లోకి వెళ్లకుండా ఉంటాయి.
* అస్తమా పేషెంట్లు టపాకాయలకు దూరంగా ఉండాలి. టకాయలలో ఉండే రసాయనల వల్ల, వాటి నుంచి వచ్చే పొగ వల్ల అనారోగ్యానికి గురవుతారు.
టపాకాయల వల్ల పర్యావరణానికి ముప్పు.
టపాకాయల తయారీలో ఉపయోగించే, రసాయనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు, పర్యావరణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. పొటాషియం క్లోరైడ్స్, పొటాషియం నైట్రేట్, మాంగనీస్, సల్ఫర్, సోడియం ఆక్సలైట్స్, అల్యూమినియం, ఐరన్ తదితర రసాయనాలను టపాకాయల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటితోపాటు అనేక రకాల విషపదార్థాలు వాతావరణంలో కలుస్తాయి. వీటివల్ల నీటి, నేల, శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతుంది. ఇది ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయి. కళ్ళ మంటలు, తలనొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు, మానసిక నరాల సమస్యలు, గుండె జబ్బులు, కేన్సర్ కారక వ్యాధులు, నిద్రలేమి, వినికిడి శక్తి తగ్గిపోవడం, హై బీపీ వంటి వంటి వ్యాధులు సంబంధించి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్త తీసుకోకపోతే కంటి, చర్మం, ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎక్కువ శబ్దం వచ్చే, టపాసుల వల్ల చిన్నపిల్లలపై, వృద్ధుల పై ప్రభావం పడుతుంది. వీలైనంతవరకు టపాసులను ఎంత తక్కువ కలిస్తే, అంత మంచిది. ఇవి కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్ రవీందర్ యాదవ్, వికారాబాద్ జిల్లా డిప్యూటీ డిఎంహెచ్వో.