పక్కదారి పడుతున్న మున్సిపాలిటీ నిధులు

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో స్థానిక అధికారులతో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది.

Update: 2024-12-16 06:30 GMT

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో స్థానిక అధికారులతో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ఏ శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా నడిపిస్తున్న అధికారుల తీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అధికారులకు తెలుసా తెలియదా అన్న ట్లుగా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు 20వ వార్డులో గతంలో జరిగిన ఓ తీర్మానాల్లో ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలు తీర్మానించుకున్నారు. కమ్యూనిటీ హాల్ అభివృద్ధి కోసం తీర్మానం చేశారు, కానీ కమ్యూనిటీ హాల్ అక్కడ లేకపోవడం కొస మెరుపు. పైగా అక్కడ జరిగిన పని వేరు.

ఇదేంటని ప్రశ్నిస్తున్న స్థానికులకు ఎక్కడో ఓ చోట అభివృద్ధి జరుగుతుంది కదా అన్నట్లు ప్రజా ప్రతినిధులు సూచించడం స్థానికుల నుంచి విమర్శలు ఎదుర్కొనేలా పరిస్థితి దాపురిస్తుంది. ఆర్‌కె నగర్ పరిధిలోని ఒక కౌన్సిలర్ ఏకంగా ఉన్న లైట్లను తొలగించి కొత్త లైట్ల కోసం పనులు చేయకుండానే చేసినట్లు రెండు లక్షల రూపాయల వరకు బిల్లులు సమర్పించిన దాఖలాలు ఉన్నాయి. తన సొంత వార్డులో చేయాల్సిన అభివృద్ధి ఏమీ లేదంటూ ఇతర వార్డులలో ఉన్న తమ సొంత ఫంక్షన్ హాల్ చుట్టూ సిసి రోడ్లు వేసుకొని ఇక్కడ కూడా కాలనీలు ఉన్నాయంటూ చెప్పుకోవడం, వాటికి అధికారులు సహకరించడం జరిగింది. అదేవిధంగా ఔటర్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న రేడియల్ రోడ్డుకు అనుమతులు లేకుండా రోడ్డు వేసుకుని మున్సిపాలిటీలో బిల్లులు పెట్టుకుంటున్నట్టు సమాచారం. ఇవే కాకుండా మున్సిపాలిటీలో కొంతమంది కౌన్సిలర్లు వ్యవహరిస్తున్న తీరు మరి విడ్డూరంగా కనిపిస్తుంది. చెప్పే పని ఒకచోట చేసే పని మరోచోట. ఇటువంటి అక్రమాలు జరుగుతున్న మున్సిపల్ ఉన్నతాధికారులు మాత్రం ఓ ప్రజాప్రతినిధి బంధువు కను సన్నాళ్లలో పనిచేయడం కొస మెరుపు.

ఆ ప్రజా ప్రతినిధి బంధువు అంటేనే హడల్

మున్సిపాలిటీలో ఓ ప్రజాప్రతినిధి బంధువు వ్యవహరిస్తున్న తీరు అటు అధికారులను ఇటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ప్రజా ప్రతినిధి బంధువు కార్యాలయానికి వచ్చారంటే అటు అధికారులు సిబ్బంది లో ఒకటే గుబులు. అతని మాట వినకుంటే తమను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తాడోనని నానా హైరానా పడుతున్నారు. కార్యాలయంలో గంటల తరబడి అధికారుల వద్ద కూర్చుని అక్రమమైన పనిని కూడా సక్రమంగా చేసుకునే ఘనత అతనిది. సదరు బంధువు కార్యాలయంలో కూర్చుంటే సామాన్యుడికి సమయం దొరకని పరిస్థితి. కార్యాలయంలో ఉన్న అతన్ని బయటకు పంపలేక బయట ఉన్న సామాన్యులను లోపలికి పిలవలేక అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఒకరోజు,రెండో రోజు అంటే పర్వాలేదు కానీ నిత్యం అదే జరగడం స్థానికులను నుంచి విమర్శలు ఎదుర్కొనేలా చేస్తుంది. అధికారులు చేస్తున్న ఒకటి రెండు తప్పులను తన ఆధీనంలో ఉంచుకొని బెదిరింపులకు పాల్పడుతూ తన సొంత అక్రమమైన పనులను సైతం సక్రమంగా చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Similar News