ఎక్కడపడితే అక్కడే పార్కింగ్…రాకపోకలకు తరచూ ఆటంకం
కడ్తాల్ పట్టణంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి పార్కింగ్ అడ్డాగా మారింది.
దిశ,ఆమనగల్లు ::- కడ్తాల్ పట్టణంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి పార్కింగ్ అడ్డాగా మారింది. ఎవరి పట్టింపు లేక వాహనదారులు రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల పార్కింగ్ తో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి కావడంతో వాహనాల వేగం పెరిగిందని, కడ్తాల్ పట్టణ కేంద్రంలో వాహనాల పార్కింగ్ చేసే చోట ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న కడ్తాల్ కు ప్రతినిత్యము వందల సంఖ్యలో బస్సులు, వ్యాపారం, ఉద్యోగం చదువుకోవడానికి వందల మంది ద్విచక్ర వాహనాలతో వస్తుంటారు. ఎక్కడ పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రధాన రహదారులపై దుకాణాలు హోటల్లు వ్యాపార కూడళ్ల వద్ద నిలుపుతున్నారు. గంటల తరబడి వాహనాల పార్కింగ్ తో దుకాణదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపైనే తోపుడు బండ్లపై చిరు వ్యాపారులు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు, రోడ్లపై వాహనాలు నిలపకుండా ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి కడ్తాలకు ప్రతినిత్యం వేలాదిమంది వివిధ పనుల మీద రాకపోకలు సాగిస్తుంటారు. స్థానికంగా ఎక్కడ పార్కింగ్ స్థలాలు లేవు. దీంతో గత్యంతరం లేక వాహనదారులు రోడ్లపైనే తమ వాహనాలను నిలపడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అందరికీ అందుబాటులో ఉండేలా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఆదాయం లభించడంతో పాటు ఇబ్బందులు తొలగుతాయి
--నేనావత్ బిక్య నాయక్, కడ్తాల్