ప్లాటినం నెఫ్ట్ భవనంపై అధికారుల సైలెన్స్
భవన నిర్మాణాలు అక్రమమా.. సక్రమమా అనేది పరిశీలించాల్సిన హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
దిశ, రంగారెడ్డి బ్యూరో, గండిపేట్ : భవన నిర్మాణాలు అక్రమమా.. సక్రమమా అనేది పరిశీలించాల్సిన హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులతో అక్రమ నిర్మాణదారులు కుమ్మక్కై ముందుకెళ్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబుల్ లేఔట్‌తో పార్కును కబ్జా చేసి మరో ప్లాట్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది అధికారులకే తెలియాలి. అంతేగాక ఆ డాక్యుమెంట్ఆధారంగా హెచ్‌ఎండీఏ అధికారులు బహుళ అంతస్తుల నిర్మాణానికి ఎలా అనుమతిచ్చారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారం వెనుక పెద్ద ఎత్తున చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది.
పార్కు స్థలం మాయం..
గండిపేట మండలంలోని హైదర్శాకోట్‌లోని 15/1లో చేసిన రాధానగర్ ఫేస్ టులో పార్క్ మాయమైంది. రాధానగర్ ఫేస్ టులో మొదటగా చేసిన లేఅవుట్ లో పార్కు స్థలం చూపించగా రెండో లేఅవుట్‌లో పార్కు స్థలాన్ని ఫ్లాటుగా చూపించారు. దీంతో ఓ బిల్డర్ దాదాపు 500 గజాల స్థలంలో డబుల్ లేఔట్ చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ డాక్యుమెంట్ తో మున్సిపల్ అధికారులను సంప్రదించి అనుమతులు తీసుకున్నాడు. దీనిపై స్థానిక కాలనీవాసులు పలుసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ప్లాట్ నెంబర్ 20కి తూర్పు రాగా పడమర ప్లాట్ నెంబర్ 21 రాగా దక్షిణానికి ప్లాట్ నెంబర్ 27 రాగా ఉత్తరానికి 40 ఫీట్ల రోడ్డు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీల హద్దులు నిర్ణయించారు. ఈ హద్దులకు అనుగుణంగా ఈస్ట్‌లో ఉన్న పార్కులో బహుళ అంతస్తులు నిర్మించిన పార్కు స్థలం కబ్జాకు గురైనట్లు తెలుస్తుంది. అసలు ఇప్పుడు రాధానగర్ ఫేస్ టూ లో పార్క్ కనిపించకపోవడం గమనార్హం.
ప్లాటినం నెస్ట్ భవనం కబ్జానా..?
రాధానగర్ ఫేస్ టూలో కబ్జా చేసి పార్క్ స్థలంలో ప్లాటినం నెస్ట్ కంపెనీ అపార్టుమెంట్ నిర్మించింది. హైదర్షాకోట్ రెవెన్యూ పరిధిలోని 15/1 లోని రాధానగర్ ఫేస్ టు లేఅవుట్ లో పార్కు స్థలం మాయమైనట్లు స్థానికులు కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తుంది. ఈ కబ్జా స్థలంలో చేపట్టిన నిర్మాణం వెనుక గత ప్రభుత్వం పెద్దల సహకారంతో ఈనాటి అధికార పార్టీకి చెందిన ఓ నేత ఉన్నట్లు సమాచారం. ఏ పార్టీ అధికారంలో ఉన్న వాళ్లతో సఖ్యత గా ఉంటూ అక్రమ వ్యవహారాలను చక్కబెట్టుకుంటారని ప్రచారం ఉంది.