ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు : సీఎం రేవంత్ రెడ్డి
దశాబ్దకాలంగా ప్రభుత్వ, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో చదివే విద్యార్ధుల కంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్లకే టాలెంట్ ఉంటుందనే ప్రచారం పెరిగిపోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
దిశ, రంగారెడ్డి బ్యూరో, మొయినాబాద్: దశాబ్దకాలంగా ప్రభుత్వ, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో చదివే విద్యార్ధుల కంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్లకే టాలెంట్ ఉంటుందనే ప్రచారం పెరిగిపోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రచారానికి చెక్ పెట్టాలంటే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాధ్యతగా విధులు నిర్వర్తించినప్పుడే సాధ్యమైతుందన్నారు. సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే విద్యార్ధుల్లో కూడా మల్టీ టాలెంటెడ్ విద్యార్ధులున్నారనే విషయాన్ని చిలుకూరు రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు నమ్మకం కలిగించారని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలోని రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏర్పాటు చేసిన కామన్ డైట్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై శనివారం ప్రసంగించారు. ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి అని అన్నారు. విద్యార్ధుల కోసం ఖర్చుచేసే నిధులు ఖర్చు కావని అన్నారు. ప్రభుత్వ స్కూల్స్లో చదివే విద్యార్ధులు భవిష్యత్తుకు ఆదర్శమని గుర్తించేలా చేస్తామని తెలిపారు.
ప్రతి నెల 10వ తేదీన గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేసేలా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకి సూచిస్తామని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్దులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 16 యేండ్లుగా పెంచలేదని సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాలను విమర్శించారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో డైట్ 40శాతం, కాస్మోటిక్ 200 శాతం చొప్పున చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని సీఎం అన్నారు. ప్రభుత్వ, రెసిడెన్షియల్లో, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో చదివే విద్యార్ధులకు, తల్లిదండ్రులకు ప్రభుత్వంపై నమ్మకం, భరోసా కల్పించేలా పని చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారని గుర్తు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న విద్యార్ధులు ఐఎఎస్, ఐపీఎస్లుగా ఎంతోమంది అయ్యారని అన్నారు.
ప్రస్తుతం టీజీపీఎస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న బుర్రా వెంకటేశం ఐఏఎస్ గా, మాజీ టీజీపీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఐపీఎస్లు సర్వేలు రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులేనని అన్నారు. రెసిడెన్షియల్, ప్రభుత్వ స్కూల్ ల్లో చదువుకున్న వాళ్లు ఎంతో మంది గొప్ప గొప్ప పదవులు, బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో సంపూర్ణ విశ్వాసం కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో డైట్, కాస్మోటిక్, మౌలిక వసతులకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని నిరూపించేందుకు సింగిల్ స్ట్రోక్ లో డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ స్కూల్స్ 23లక్షలు విద్యార్థులు చదువుకుంటున్నారు.. 11వేల ప్రైవేట్ స్కూల్స్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ప్రయివేట్ స్కూల్స్ లో చదువు చెప్పేవారికి ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఎక్కువ అర్హత ఉందా? అని సీఎం ప్రశ్నించారు.
మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నామనే విషయాన్ని ఆలోచించాలని టీచర్లకు సీఎం సూచించారు. ఎందుకు మనం ఆ ఆలోచన చేయకూడదు.. ఇది మన బాధ్యత కాదా? అని అన్నారు. 70 ఏళ్ల నుంచి మనం నేర్చుకున్నదేంటి... వచ్చే విద్యా సంవత్సరం కోసం ముందు నుంచే ఎందుకు ప్రణాళికలు వేసుకోవడం లేదనే విషయాన్ని సీఎం చర్చించారు. ఇది ప్రభుత్వం తరపున మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇది మన బాధ్యత.. ఈ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేమని అన్నారు. ఈ మధ్య ఫుడ్ పాయిజన్ జరిగి ఒక బాలిక మరణించింది.. ఆ బాలిక తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని తెలిపారు. పిల్లలపై శ్రీమంతుడుకి , పేదవాడికి ఒకే రకమైన ప్రేమ ఉంటుందని అన్నారు. మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలని నిర్వహకులకు సీఎం సూచించారు. ఇది మన గౌరవ ప్రతిష్టలను పెంచేదా.. తగించేదా..? బాధ్యతగా వ్యవహారిస్తే గౌరవం పెరుగుతుందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు.
విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పని రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. కుట్టు పనికి ఇచ్చే రుసుం రూ.25 నుంచి రూ.75 కు పెంచి వారికి అప్పగించామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని అన్నారు. వారంలో రెండు,మూడు రోజులు రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగ సమస్య పెరుగుతోందని తెలిపారు. అందుకే రాష్ట్రంలో 75 ఐటీఐ లను టాటా సంస్థతో కలిసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దేశానికే ఆదర్శంగా నిలుపుతామని స్పష్టం చేశారు. 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నాం అని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిఖత్ జరీన్, సిరాజ్ లాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
క్రీడల్లో రాణించండి, మీలో టాలెంట్ కు పదును పెట్టండిని యువతకు పిలుపునిచ్చారు. విద్యార్థులలో ఉన్న ఇతర టాలెంట్ ను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. వారికి కావాల్సిన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్పొరేట్ కు ధీటుగా ప్రతీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ విద్యార్థులు అనాథలు కాదు... వాళ్లు రాష్ట్ర సంపద అని సీఎం కితాబ్నిచ్చారు. నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భవిష్యత్ లో నేను ఎక్కడికి వెళ్లినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తానని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు. విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వారు తినే ఆహారాన్ని వాళ్లే మానిటరింగ్ చేసుకునే వీలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.