ఢీ అంటే ఢీ అంటున్న తాజా,మాజీ ఎమ్మెల్యేలు..

కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి,

Update: 2024-10-19 10:39 GMT

దిశ,ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అభివృద్ధి విషయంలో ఢీ అంటే ఢీ అంటున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి లేకుండా చేసింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విమర్శించగా, బదులుగా నా రాజకీయ జీవితంలో చిన్న తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమాధానమిచ్చారు. మూడు రోజుల క్రితం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు.

గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణానికి 204 కోట్లు మంజూరు అయ్యాయి అని తెలిపారు. గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని,2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రజలను మభ్యపెట్టేలా హామీలు ఇచ్చి, మోసగించారని విమర్శించారు.2023 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో మరోసారి నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అమలు కానీ ప్రొసీడింగ్ కాపీలతో హంగామా సృష్టించారని ఎమ్మెల్యే విమర్శించారు.

అధికారం మీదే కదా అభివృద్ధి చేయండి : మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి నియోజక అభివృద్ధి చేయాలని సూచించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి జరగలేదని విమర్శించడం ఎమ్మెల్యేకు తగదని సూచించారు. నా రాజకీయ జీవితంలో ఏ చిన్న తప్పు చేసినట్లు నిరూపించిన రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రాజకీయ భిక్ష పెట్టిన బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యే విమర్శించడం ఆయన రాజకీయ అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు.

ఎన్నికలకు ముందు ప్రొసీడింగ్ కాపీలా..

2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమనగల్లు అభివృద్ధికి ఇచ్చిన హామీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం,పాలిటెక్నిక్ కళాశాల,డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నాలుగున్నర సంవత్సరాలుగా హామీలను మరచిపోయి 2023 ఎన్నికలకు మూడు నెలల ముందు ప్రొసీడింగ్ కాపీలు తేవడం ఏమిటని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.


Similar News