దళారులతో కుమ్మక్కైన అధికారులు.. మంత్రి పేరుతో భూదందా

రంగారెడ్డి జిల్లాలో భూమాయ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సక్రమంగా చెందే ఆదాయానికి గండి పడుతోంది. ముఖ్యంగా గ్రామపంచాయతీ పరిధులను టార్గెట్ చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్రయవిక్రయాలు జరిపిస్తున్నారు.

Update: 2024-10-07 03:12 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: అక్రమ పద్ధతిలో చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఏకంగా ఓ మంత్రి కి సంబంధించిన బంధువులమని ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయం ఉందన్న విషయం అవాస్తవం. ఎందుకంటే ప్రభుత్వంలోని పెద్దలందరూ భూ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కొందరు రియల్ వ్యాపారులు చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో భూమాయ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సక్రమంగా చెందే ఆదాయానికి గండి పడుతోంది. ముఖ్యంగా గ్రామపంచాయతీ పరిధులను టార్గెట్ చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్రయవిక్రయాలు జరిపిస్తున్నారు. అందుకు ప్రధానంగా ఒక గుంటకు 121 గజాలు అయితే గజానికి ఓ రేటు నిర్ణయించి ఎన్ని గుంటల భూమి ఉంటదో అన్ని గజాలకు ధరను నిర్ణయిస్తున్నారు. సామాన్య రైతులకు మాత్రం భూమిని ఎకరాల్లో ధరను కట్టిస్తున్నారు. దీని మొత్తం నాలా కన్వర్షన్ చేయకుండా చెట్లు పెట్టడం ఫ్రీకాస్ట్ ఏర్పాటు చేయడం చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారు. నాలా కన్వెన్షన్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. ఆ ఆదాయానికి కూడా స్థానిక రెవెన్యూ, పంచాయతీ అధికారుల తప్పిదాలతో ఫామ్ ల్యాండ్‌లకు గిరాకీ పెరిగింది.

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకుల్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 37, 38, 39లలో సుమారు 26 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓ రియాలిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్‌ఎల్పీ కంపనీ లేఅవుట్ చేసినట్లుగా పద్ధతిగా కడీలు పాతారు. అంతేకాకుండా 30 ఫీట్లు మట్టి రోడ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కడీలకు నంబర్లు వేసినట్లు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. చుట్టూ ప్రీ కాస్ట్ ఏర్పాటు చేయడం దేనికి సంకేతం. డబ్బులకు కక్కుర్తి పడి రెవెన్యూ అధికారులు, అటు పంచాయతీ కార్యదర్శి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అంటే గుంటల్లో భూమి రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు కనీసం పరిశీలించాల్సిన సోయి రెవెన్యూ అధికారులకు లేకపోలేదా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇష్టానుసారంగా గుంటల్లో, గజాల్లో తక్కువ ఉన్నా రిజిస్ట్రేషన్ చేయడంతో అమ్యామ్యాలతోనే రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మీద దృష్టి పెట్టడం లేదని ఈ ఘటనను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.

ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు..

తెలంగాణ రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే రియల్ ఎస్టేట్ కంపెనీల ఫామ్ ల్యాండ్ వ్యాపారాన్ని నియంత్రించేందుకుగాను తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ 9.7.2021న పంచాయతీరాజ్ యాక్ట్ 2018, మున్సిపల్ యాక్ట్ 2019 నూతన చట్టం ప్రకారం జీవో జారీ చేశారు. ఫామ్ ల్యాండ్ వెంచర్లకు కనీసం 20 గుంటలకు తక్కువగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని మెమో నంబర్ 2461/ పీఎల్ఏ111/2020 ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాలు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ కొందుర్గ్ తహశీల్దార్ ఈ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారు.

రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో కస్టమర్లకు ఎర..

రీజినల్ రింగ్ రోడ్(RRR) కొందుర్గు ప్రాంతం మీదుగా వెళ్తుందని, ట్రిపుల్‌ఆర్ రాకతో భూముల ధరలు మరింత పెరుగుతాయని రియల్ వ్యాపారులు కస్టమర్లను నమ్మిస్తున్నారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ రావడం హైదరాబాద్ ప్రాంతానికి షాద్ నగర్ సమీపంగా ఉండడంతో వెంచర్లు ఎక్కువ అవుతున్నాయి. అది అదునుగా భావించి కొంతమంది రియల్టర్లు వ్యవసాయ భూములను కొని పూర్తిస్థాయిలో డెవలప్ మెంట్ చేయకుండానే ప్లాట్లు అమ్మడం ఈ విధంగా షాద్ నగర్ ప్రాంతానికి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి గుర్తింపు ఉంది.

అధికారుల చర్యలేవి..?

సామాన్య ప్రజలు అన్ని రకాలుగా భూమి మీద హక్కులున్న వారు నెలల తరబడి తిరిగినా డబ్బులిస్తేనే పనిచేసే నూతన ఒరవడి రెవెన్యూ వ్యవస్థలో నెలకొంది. వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోకుండా గ్రామ పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతోనే వ్యాపారులు ఇలాంటి అక్రమ వెంచర్లు, ఫామ్ ల్యాండ్‌లు పుట్టుకొస్తున్నాయి. ముడుపులకు ఆశపడి అధికారులు పనిచేస్తున్నారు. వ్యవసాయ భూమిగా వీటిలో స్థిరాస్తి తరహా నిర్మాణాలు క్రమంగా రూపుదిద్దుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో భూమి పరిశీలన విస్తీర్ణంతో సంబంధం లేకుండా ధరణి ద్వారా లావాదేవీలు పూర్తి అవుతుండటమే దళారులకు కాసులు కురిపిస్తోంది. గుంటలుగా విక్రయిస్తే నాలా పన్ను, డీటీసీపీ, రేరా ఫీజులు రావు. కనుక ప్రభుత్వం భారీగా రాబడి నష్టపోతుంది. దీనిపై ఉన్నతస్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News