లక్షలు వెచ్చించి నిర్మించారు..నిరుపయోగంగా పడేశారు

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తాము తమ పొలాల్లో పండించిన

Update: 2024-09-30 11:12 GMT

దిశ, శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తాము తమ పొలాల్లో పండించిన కూరగాయలను వినియోగదారులకు అమ్ముకునేందుకు ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో గ్రామ సంతల నిర్మాణం చేపట్టింది. పండించిన రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు వినియోగదారులకు అతి తక్కువ ధరకు తాజా కూరగాయలు అందించాలన్న సదుద్దేశంతో ప్రతి గ్రామంలో గ్రామ సంతల ఏర్పాటు చేసింది. అన్ని గ్రామాల్లో గ్రామ సంత ల నిర్మాణం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టారు. గ్రామీణాభివృద్ధి శాఖ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ సంతల నిర్మాణం చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కథ ఇక్కడి నుంచి మొదలైంది. నిర్మాణాలు అయితే చేపట్టారు.. కానీ వాటిని ఏ గ్రామంలో కూడా ఉపయోగించడం లేదు. ఎంతో ఆర్భాటంగా అధికారులు నిర్మించి గ్రామపంచాయతీకి అప్పగించాం... మా పని అయిపోయింది.. వారే ఏమైనా చేసుకోవాలి అనే విధంగా అధికారుల తీరు ఉండడంతో లక్షలు వెచ్చించి నిర్మించిన గ్రామ సంతలు నేడు ఏ గ్రామానికి వెళ్లి చూసినా అవి నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి.

గ్రామ సంచులు నిర్మించిన అధికారులు గ్రామ పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని గ్రామాలలో రోడ్లపై కూర్చుని కూరగాయలు అమ్ముకునే విక్రయదారులను నిర్మించిన గ్రామ సంత లోకి తరలించి అక్కడ అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవడంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మండల అభివృద్ధి శాఖ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శంకర్పల్లి మండలం దొంతాన్ పల్లి గ్రామంలో గ్రామ సంత గ్రామానికి కొంత దూరంలో నిర్మించారనే సాకుతో వినియోగించుకోవడం లేదు. ఆ గ్రామంలో కూడా కూరగాయల క్రయవిక్రయాలు రోడ్డుపైనే కొనసాగిస్తున్నారు. నిర్మించిన గ్రామ సoతలో కూరగాయల విక్రయాలు ప్రారంభం కాకముందే గేటు విరిగిపోయింది. కుక్కలకు ఆవాసంగా తయారయింది.

జన వాడ, మహారాజ్పేట్, దొంతాన్ పల్లి, గోపులారం, మహాలింగాపురం, గాజుల గూడెం,లక్ష్మారెడ్డి గూడెం, కొత్తపల్లి, అంతప్పగూడా తదితర గ్రామాల్లో నిర్మించిన గ్రామ సంతలు వినియోగంలోకి తీసుకురావడంలో గ్రామ పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కూడా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో ప్రభుత్వ ఆశయం నీరుగారినట్లే కనిపిస్తుందని పలువురు అంటున్నారు. మోకిలా గ్రామంలో కూడా రోడ్లపైనే కూరగాయల క్రయవిక్రయాలు జరుగుతున్నా అక్కడ లక్షలు వెచ్చించి సమీకృత మార్కెట్ ఏర్పాటు చేసినప్పటికీ అందుబాటులోకి తీసుకు రాలేదు. దీంతో మోకిల గ్రామంలో శంకర్పల్లి- గండిపేట్ రహదారిపై కూరగాయల క్రయవిక్రయాలు ( మార్కెట్) జరుగుతుండడంతో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై ఎక్కడ ప్రమాదాలు సంభవిస్తాయోననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రజాధనంతో నిర్మించిన భవనాలను ముందుచూపు లేకుండా నిర్మించడం నిరుపయోగంగా వదిలేయడం నిర్మించిన సమయంలో ఉన్న అధికారులు బదిలీ కావడం కొత్తగా వచ్చిన అధికారులు తమకేమీ సంబంధం లేదని తమ హయాంలో నిర్మించలేదని రకరకాల సమాధానాలు చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఆయా గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రజాధనంతో నిర్మించిన గ్రామ సంతలను వినియోగం లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పట్టించుకోని ప్రత్యేక అధికారులు..

గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగిసి 9 నెలలు గడుస్తుండడంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రత్యేక అధికారులు కూడా గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రోడ్లపై నుంచి నీరు పారడం, పట్టపగలు వీధి లైట్లు వెలగడం ప్రతి గ్రామంలో సర్వసాధారణంగా తయారయింది.


Similar News