వికారాబాద్ దళితులకు కేసీఆర్ బంపర్ ఆఫర్

వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ను గెలిపించుకుంటే హుజూరాబాద్ నియోజకవర్గం మాదిరిగా ఎస్సీ నియోజకవర్గం అయినా వికారాబాద్ లో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఒకే విడతలో దళితబందు పెడతానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

Update: 2023-11-23 15:51 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ను గెలిపించుకుంటే హుజూరాబాద్ నియోజకవర్గం మాదిరిగా ఎస్సీ నియోజకవర్గం అయినా వికారాబాద్ లో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఒకే విడతలో దళితబందు పెడతానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో జరిగిన భారీ భహిరంగ ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఎక్కువగా ఉండే వికారాబాద్ నియోజకవర్గ దళితుల దరిద్రం పోగొడతానని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి దళిత కుటుంబానికి ఏకకాలంలోనే దళితబంధు పథకం అమలు చేస్తానని పేర్కొన్నారు. ఈ దెబ్బతో దళిత కుటుంబాలు మొత్తం ధనిక కుటుంబాలు అవుతాయి. ఈ పథకాన్ని స్వయంగా నేనే వచ్చి ప్రారంభిస్తానని అన్నారు. అలాగే హైదరాబాద్ కు అత్యంత దగ్గరగా ఉన్న ఈ ప్రాంతానికి ఐటీ రంగం కూడా త్వరలోనే విస్తరించనుందన్నారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రకృతికి భంగం కలగకుండా పొల్యూషన్ లేని కంపెనీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఆనంద్ ను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత నాది : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రము వచ్చినప్పుడు తాగడానికి నీళ్లు లేవు, కరెంట్ కష్టాలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల ఆకలి చావులు, యువకులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లడం ఇలా అనేక సమస్యలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా..? ప్రజలు ఆలోచించాలన్నారు. ముఖ్యంగా పాలమూరు ఎత్తిపోతల పథకంలో మీ వాటా ఉంది, అది మీ హక్కు. ఏడాదిలో పాలమూరు రంగారెడ్డి పథకంతో వికారాబాద్ జిల్లాలోని ప్రతి ఎకరాకు నీళ్లు పారిస్తామన్నారు. పంపులు మొన్ననే ప్రారంభించుకున్నామని, కాలువలు తీసుకుంటే నీళ్లు రావడమే ఆలస్యం అన్నారు. 50 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసింది ఏమి లేదన్నారు. ఒక్క చిన్నతప్పు చేస్తే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కావున ఈసారి ప్రజలు ఆలోచనతో ఓటు వేయాలన్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఆదివారం కట్టబెడితే రాష్ట్రంలో ఉత్తమమైన అసమాజాన్ని తాయారు చేసుకుందామన్నారు.

ఆనంద్ ను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత నాదే అన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ వికారాబాద్ లో మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఆయుష్ ఆసుపత్రి, 50 పడకల ఐసీయూ హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్, వికారాబాద్ పట్టణంలో రూ.96 కోట్లతో నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రారంభం, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.60 కోట్ల నిధుల కేటాయింపు ఇలా చెప్పుకుంటూ పోతే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. మల్లి అధికారంలోకి వస్తే మా వికారాబాద్ కు రింగు రోడ్డు మంజూరు చేయాలన్నారు. తెలంగాణ ఊటీగా పిలవబడే అనంతగిరిని పర్యాటక కేంద్రంగా చేయాలని, అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే ధారూర్ మండలంలో ఒక జూనియర్ కాలేజీ, మోమినిపేట్ మండలంలో ఒక మైనారిటీ జూనియర్ కాలేజ్ తదితర అభివృద్ధి పనులను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసుధనా చారి, మాజీ కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ ఛైర్మెన్ నాగేందర్ గౌడ్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News