హైడ్రా కూల్చివేతల్లో హిందువులపై కక్ష సాధింపు
హైడ్రా కూల్చివేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై కక్ష సాధిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
దిశ, శంషాబాద్ : హైడ్రా కూల్చివేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై కక్ష సాధిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గోకరి అర్జున్ గౌడ్ తన తండ్రి జ్ఞాపకార్థం సుమారు కోటి 50 లక్షల రూపాయలు వెచ్చించి 10వ తరగతి గదులను నిర్మించిన సందర్భంగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనీసం టైంకు జీతాలు ఇవ్వడానికి, రుణమాఫీ చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ, రూ.లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదం అన్నారు. హైడ్రాను తీసుకువచ్చి కేవలం హిందువుల ఇళ్లనే కూల్చుతున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే చెరువులో ఓవైసీ కట్టిన కళాశాలను ముందు కూల్చాలన్నారు. హైడ్రా కూల్చివేతలకు బీజేపీ వ్యతిరేకం కాదని అన్నారు. ప్లాట్లు అమ్మిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగానే ఉన్నారు కానీ అక్కడ ఇల్లు కట్టుకున్న పేదవారు మాత్రం కూల్చివేతలతో రోడ్డున పడుతున్నారన్నారు. పేదల బతుకులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుకుంటుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు భోంచేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి లక్షన్నరకోట్లతో మూసీ ప్రక్షాళన అంటున్నాడని ఆరోపించారు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ రూ.లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు అన్నారు.
గత ప్రభుత్వం రూ.ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.పది లక్షల కోట్లు అప్పుచేసి తెలంగాణ రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి ఇబ్బంది ఏంటి అన్నారు. ఇదంతా చూస్తుంటే తిరుమల లడ్డూ విషయంలో జరిగినదంతా వాస్తవమే అనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా భారతి దక్షిణ మధ్య సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి, పాఠశాల అధ్యక్షులు గోకరి అర్జున్ గౌడ్, కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.