ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు : తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు.
దిశ, శంషాబాద్ : ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హైదర్గూడా ఎర్రగోడాలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 7 లో యదేచ్చగా బండరాలను యంత్రాలతో పగలగొట్టి, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో గురువారం తాసిల్దార్ ఆదేశాలతో డిప్యూటీ తాసిల్దార్ క్రాంతి రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ యంత్రాలతో బండరాలను పగలగొట్టి ఆక్రమిస్తున్నట్టు గుర్తించామన్నారు.
అక్కడ పనిచేస్తున్న కంప్రెషర్ మిషన్ సీజ్ చేసి పనులు నిలిపివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమించిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మరోసారి ఇలాంటి పనులు చేస్తే క్రిమినల్ కేసునమోదు చేస్తామన్నారు. ఈ ఆక్రమణలు ఎవరు చేపిస్తున్నారు అనే కోణంలో పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సారిక, వినయలత తదితరులు పాల్గొన్నారు.