మున్సిపల్ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం

జీవో నెంబర్ 111 పరిధిలో అక్రమ నిర్మాణాలను ఆపడం మీ బాధ్యత కాదా అంటూ శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-10-20 16:08 GMT

దిశ, శంకర్పల్లి : జీవో నెంబర్ 111 పరిధిలో అక్రమ నిర్మాణాలను ఆపడం మీ బాధ్యత కాదా అంటూ శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషనర్ పై హైకోర్టు జస్టిస్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ సర్వే నెంబర్ 81 లో గల భూమిలో ఓ ప్రహరీ గోడ నిర్మాణంపై కోర్టులో విచారణ జరిగింది. 111 జీవోలో ఎన్ని అక్రమ నిర్మాణాలు జరిగాయి. వాటిని ఎందుకు ఆపడం లేదంటూ జడ్జి ప్రశ్నల వర్షం కురిపించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని జడ్జి ముందు కమిషనర్ సమాధానం ఇచ్చుకోగా 111 జీవో లో అక్రమ నిర్మాణాలను ఆపే అధికారం నీకు లేదా? నీకు జీతం డబ్బులు మీ పై అధికారులు ఇస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 111 జీవో పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో నేను చూపించాలా? ఫోటోలు ఆయనకు చూపించండి అంటూ జడ్జి కోర్టు సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయం పై కమిషనర్ శ్రీనివాస్ ను వివరణ కోరగా కోర్టు విషయంపై స్పందించడానికి నిరాకరించారు. వీడియోలు వైరల్ అయ్యాయని తెలుపగా కోర్టు ఆదేశాల మేరకు తాను నడుచుకుంటా అని తెలిపారు.


Similar News